న్యూఢిల్లీ: దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్‌కు గిరాకీ జోరుగా పెరిగింది. గత ఏడాదిలో ఈ నగరాల్లో అల్‌టైమ్ హై స్థాయిలో స్థూలంగా 6.16 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ ప్రదేశాన్ని కంపెనీలు అద్దెకు తీసుకున్నాయి. అంతకు ముందు ఏడాదితో పోల్చితే ఇది 25 శాతం అధికం. ఆఫీస్ స్పేస్ సప్లయ్‌తో పాటు డిమాండ్ కూడా జోరుగా పెరుగుతోందని ప్రాపర్టీ కన్సల్టెంట్ సీబీఆర్ఈ వెల్లడించింది. ఇదిలా ఉంటే.. 2019లో ఎనిమిది నగరాల్లో అద్దెకు ఇచ్చిన ఆఫీస్ ప్రదేశంలో 27 శాతం పెరిగి 6.06 కోట్ల చదరపు అడుగులకు చేరినట్టు ఇటీవలే నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. గత ఏడాది ఏడు ప్రధాన నగరాల్లో నికరంగా అద్దెకు తీసుకున్న ఆఫీస్ ప్రదేశం 40 శాతం పెరిగి 4.65 కోట్ల చదరపు అడుగులకు చేరుకున్నట్టు జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. అంతర్జాతీయ బహుళజాతి కంపెనీలు, దేశీయ కంపెనీల నుంచి ఆఫీస్ ప్రదేశానికి ఎక్కువగా డిమాండ్ ఏర్పడుతోంది.
ఇక హైదరాబాద్, బెంగళూరులో ఆఫీస్ ప్రదేశం ఎక్కువగా అందుబాటులోకి వస్తోంది. సీబీఆర్ఈ నివేదిక ప్రకారం.. వార్షిక ప్రాతిపదికన హైదరాబాద్, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్), ముంబై నగరాలు ఆఫీస్ స్పేస్‌లో అధిక వాటాను కలిగి ఉన్నాయి. అద్దెకిచ్చిన మొత్తం ఆఫీస్ ప్రదేశంలో ఈ నగరాల వాటాయే దాదాపు 75 శాతంగా ఉంది. కోచి మినహా మిగతా నగరాల్లో అద్దెకు తీసుకున్న ఆఫీస్ ప్రదేశం పెరిగింది.