మందగమనంతో 16 లక్షలు తగ్గనున్న కొలువులు

 దేశంలో ఉద్యోగాల కల్పనపై ఆర్థిక మందగమనం తీవ్ర ప్రభావం చూపిందని ఎస్‌బీఐ అధ్యయన నివేదిక- ఎకోవ్రాప్‌ వెల్లడించింది. ఈపీఎఫ్‌ఓ డేటా ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరం (2018-19) లో కొత్తగా 89.7 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది. మందగమనం కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో కొత్త ఉద్యోగాలు 2018-19తో పోలిస్తే కనీసం 15.8 లక్షల మేర తగ్గనున్నాయని రిపోర్టు పేర్కొంది. గత ఏడాది ఏప్రిల్‌-అక్టోబరు కాలానికి పుట్టుకొచ్చిన కొత్త ఉద్యోగాలు 43.1 లక్షలు. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి 73.9 లక్షలుగా నమోదుకావచ్చని అంచనా.
నివేదికలోని ముఖ్యాంశాలు
అసోం, రాజస్థాన్‌, బిహార్‌, ఒడిశాతోపాటు మరికొన్ని రాష్ట్రాలకు రెమిటెన్స్‌లు తగ్గాయి. దివాలా పరిష్కార చర్యల్లో జాప్యంతో కంపెనీలు కాంట్రాక్టు కార్మికులను తగ్గించుకోవడం ఇందుకు కారణమై ఉండవచ్చు.
తక్కువ వేతనాలు (నెలకు రూ.15,000) కలిగిన ఉద్యోగాలు ఈపీఎ్‌ఫఓ పరిధిలోకి వస్తాయి. 2004 నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాలు, ప్రైవేట్‌ ఉద్యోగాలను నేషనల్‌ పెన్షన్‌ స్కీం(ఎన్‌పీఎస్‌) పరిధిలోకి చేర్చారు.ఎన్‌పీఎస్‌ డేటా కూడా నిరాశాజనకంగానే ఉంది. ప్రస్తుత ధోరణి ప్రకారంగా 2019-20లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాల కల్పన సైతం 39,000 మేర తగ్గవచ్చని అంచనా.
గడిచిన కొన్నేళ్లలో దేశంలోని పేదలతోపాటు దిగువ మధ్యతరగతివర్గాల్లో ఉపాధి కోసం వలసలు పెరిగాయి. అసమాన వృద్ధి పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ ఆధారిత, పారిశ్రామికాభివృద్ధి అంతగా లేని రాష్ట్రాల నుంచి అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు.ఉదాహరణకు, ఉత్తర ప్రదేశ్‌, బిహార్‌, మధ్యప్రదేశ్‌ దక్షిణ ప్రాంతం, ఒడిశా, రాజస్థాన్‌ నుంచి పంజాబ్‌, గుజరాత్‌, మహారాష్ట్రకు వలస పోతున్నారు. వలస కార్మికులకు ఢిల్లీ అడ్డాగా మారింది.
గత ఐదేళ్లలో ఉత్పాదక వృద్ధిలో ఎదుగుదల లేదు. 9.4 శాతం నుంచి 9.9 శాతానికి చేరుకోగలిగింది. జాబ్‌ మార్కెట్లో కనిష్ఠ వేతన వృద్ధికి ఇది స్పష్టమైన సంకేతం.
పారిశ్రామికోత్పత్తి మందగమనంతో కంపెనీలు, కుటుంబాలు మోతాదుకు మించి అప్పులు చేయాల్సిన పరిస్థితులకు దారితీస్తుందని, ఇది ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా పరిణమించవచ్చని నివేదిక హెచ్చరించింది.
వాల్‌మార్ట్‌లో 56 మంది
భారత్‌లో 56 మంది ఎగ్జిక్యూటివ్‌లను తొలిగించినట్లు ప్రపం చ రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ ప్రకటించింది. అందులో 8 మంది సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ స్థాయి ఉద్యోగులు కూడా ఉన్నారు. దేశంలో తన వ్యాపార పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగానే కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వాల్‌మార్ట్‌ దేశంలో 28 హోల్‌సేల్‌ స్టోర్లను నిర్వహిస్తోంది.
 
ఓయోలో 1000కిపైగా
గొలుసుకట్టు హోటళ్ల నిర్వహణ స్టార్టప్‌ ఓయో.. భారత్‌లో 1,000కి పైగా ఉద్యోగులను బయటికి సాగనంపే ఆలోచనలో ఉంది. వ్యాపారంలోని అన్ని విభాగాలు, వాటి కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉద్యోగాలను తగ్గించుకోవాలని అనుకుంటోంది. ఓయో గ్రూప్‌ సీఈఓ రితేష్‌ అగర్వాల్‌ ఇందుకు సంబంధించి భారత్‌, దక్షిణాసియాలోని ఉద్యోగులకు ఈ-మెయిల్‌ కూడా పంపారు.
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.