పాలనలో వేగం పెంచిన జగన్….

పాలనలో వేగం పెంచిన జగన్…

నిజాయితీ, పారదర్శకతే ప్రాతిపదికలుగా నిర్ణయాలు…

సిద్ధమవుతున్న జగన్ డ్రీం టీం….

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ తనదైన మార్కును చూపిస్తున్నారు. పాలనలో వేగం..నిజాయితీ…పారదర్శతకు పట్టం కట్టేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మే 30న రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతోనే తానేంటో…ఎలా ఉంటోనో చెప్పిన వైఎస్ జగన్..ఆ దిశగా అడుగులు కదుపుతున్నారు. నిర్ణయాల్లో వేగం పెంచారు. పాలనలో కచ్చితత్వం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వేళ  తొలిసంతకంతో  అవ్వాతాతలకు భరోసా ఇచ్చేశారు. పెన్షన్‌ మొత్తాలను భారీగా పెంచుతూ జీవో ఎంఎస్‌ నంబర్‌ 103జారీచేశారు. ప్రభుత్వ పధకాల్ని సమర్ధవంతంగా అమలు చేసేందుకు బదిలీలకు శ్రీకారం చుట్టారు. సీఎం పేషీ, సెక్రటేరియట్ వంటి కీలక విభాగాల్లో ప్రక్షాళన ప్రారంభించారు. పాత వాసనలు ఉండకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కీలక అధికార్ల నియామకం, కొంతమందిపై బదిలీ వేటు, మరి కొంతమందికి ఉద్వాసన వెంటవెంటనే జరిగిపోయాయి. అవినీతికి తావులేని విధంగా సమర్ధవంతమైన, నిజాయితీ కలిగిన అధికార్లను చుట్టూ పెట్టుకునేందుకు ఇప్పటికే జగన్ తనదైన ఓ డ్రీం టీం ను సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగానే డీజీపీగా గౌతమ్ సవాంగ్, ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా స్టీఫెన్ రవీంద్ర తదితరుల నియామకం. ఇటు జిల్లా స్థాయిలో కూడా బదిలీలకు కసరత్తు జరుగుతోంది.

తొలి సంతకం…నిర్ణయాలు

ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ల మొత్తాన్ని పెంచుతూ జగన్‌ ప్రభుత్వం తొలి జీవో జారీ చేసింది. మరోవైపు వృద్ధులతో పాటు వికలాంగులు, చేనేత, వితంతు, ఒంటరి మహిళల, మత్స్యకారులతో పాటు కిడ్నీ వ్యాధులకు సంబంధించి డయాలసిస్‌ పేషెంట్ల పెన్షన్లను భారీగా పెంచారు. మొత్తం మీద 2వేలున్న పెన్షన్ ను 2 వేల 250 కి పెంచారు. మరోవైపు ఇతర పెన్షన్లను ప్రభుత్వం 3 వేలు చేశారు. డయాలసిస్‌ చేయించుకునే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పింఛనును 3 వేల 5 వందల నుంచి పదివేలకు పెంచుతూ జీవో సైతం విడుదల చేసేసారు.  ఇక పెరిగిన పింఛన్లన్నీ జూలై నెల నుంచి  క్రమం తప్పక అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక పెన్షన్‌ వయస్సును 65నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తూ జగన్‌ సర్కార్‌ తీసుకున్న మరో నిర్ణయంతో అవ్వాతాతలకు నిజమైన భరోసా లభించింది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారనేది ప్రజలు గుర్తిస్తున్నారు.  ఆగస్టు నాటికే గ్రామస్థాయిలో ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్‌తో పాటు అక్టోబర్‌–2 నాటికి గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి సచివాలయంలో పది మందికి చొప్పున ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు సీఎం జగన్‌ ప్రకటించారు. పారదర్శకంతో పాటు…ప్రతి ఒక్కరికీ పధకాలు చేరుస్తానన్న జగన్ మాట ఈ నిర్ణయంతో అమలు కానుంది.

ఎన్నికలలో చెప్పిన నవరత్నాలు పథకాలతో పాటు అన్ని రకాల పథకాలను అవినీతికి తావులేకుండా సమర్ధవంతగా అమలు చేసేందుకు జగన్‌ సర్కార్‌ సర్వం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం సమర్దులైన అధికారులను నియమించేందుకు సీఎం కసరత్తు వేగవంతం చేశారు. చంద్రబాబు  సర్కార్‌లో అవినీతి అక్రమాలకు పాల్పడిన అధికారులను తప్పించి సమర్దవంతమైన అధికారులను నియమించేందుకు వైఎస్‌ జగన్‌ సిద్ధమయ్యారు. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులు, వారి పనితీరుకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం సేకరించింది. రెండు మూడు రోజుల్లోనే జిల్లా స్థాయి అధికారుల బదిలీలు జరగనున్నట్లు తెలుస్తోంది. దీంతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మొత్తంగా ప్రమాణస్వీకారం చేసిన రెండు రోజుల్లోనే సీఎం జగన్‌ పాలనలో స్వీడు పెంచారు. ఆయన తీరును గమనిస్తున్న జనం సీఎం జగన్‌ ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తారని, సమర్ధవంతమై పాలను అందిస్తారని నమ్మకంతో ఉన్నారు.ఇప్పటికే ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి జగన్ ను కలిశారు. తెలంగాణా నుంచి ఏపీకు డిప్యుటేషన్ రావాలనుకుంటున్న ఆమెను జగన్ తన డ్రీం టీంలో తీసుకోనున్నారు. ముఖ్యంగా జగన్ మానస పుత్రికగా భావిస్తున్న నవరత్నాలకు ఆమెనే ఇన్ ఛార్జ్ గా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆర్ధిక పరిస్థితిపై జగన్ సమీక్ష

ఇంకోవైపు రాష్ట్రంలోని ఆర్ధిక పరిస్థితిపై ఎప్పటికప్పుడు పరిశీలన  చేస్తున్నారు. శనివారం ఆర్ధిక రెవిన్యూ శాఖల అధికార్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.  దాదాపు రెండు గంటల సేపు జదరిగిన ఈ సమీక్షలో జగన్ కొన్ని కీలక నిర్ణయాలు సైతం తీసుకున్నారు. మద్యపాన నిషేధాన్ని దశలవారీగా అమలు చేయడానికి ఉన్న మార్గాన్ని అణ్వేషించాలన్నారు. మద్యపానం అంటేనే నిరుత్సాహ పరిచేలా కార్యాచరణ ఉండాలని సూచించారు జగన్. ప్రత్యామ్నాయంగా రెవిన్యూను పెంచుకునే మార్గాల్ని పరిశీలించాలన్నారు.మరోవైపు ఇదే సమీక్షలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులపై వైఎస్ జగన్ కు అధికార్లు సునిశితంగా వివరించారు. పన్నుల రూపంలో ఆదాయం, కేంద్రం నుంచి రావల్సిన, వచ్చే నిధుల వివరాలను ప్రజంటేషన్ రూపంలో తెలిపారు. భారీ మార్పులకు సిద్ధమవుతున్న జగన్…

ఇటు రాష్ట్ర పాలనా వ్యవస్థలో పెద్దఎత్తున మార్పులకు జగన్ సిద్ధమవుతున్నారు. ఐఏఎస్,ఐపీఎస్ అధికార్ల నుంచి ఆర్డీవో, డీఎస్పీల వరకూ ఈ మార్పు తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతోంది. దాదాపు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు స్థానభ్రంశం కలగనుందని తెలుస్తోంది. మంత్రివర్గం కంటే ముందుగానే జగన్ ఆలోచనకు తగ్గట్టుగా కదిలే పాలనా సిబ్బందిని నియమించుకోవాలన్నది ప్రదాన ఆలోచనగా ఉంది. ప్రతి జిల్లాలోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా…సమర్ధవంతాగ అవినీతికి తావులేకుండా వ్యవస్థను నడిపించే అధికార్లు కావాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. మొత్తం 100 వరకూ అఖిల భారత సర్వీసు అధికార్ల బదిలీలు ఉండవచ్చన తెలుస్తోంది.ఇటు పోలీసు వ్యవస్థలో కూడా కీలక మార్పుల్ని జరగనున్నాయి. చాలాప్రాంతాల్లో  డీఎస్పీల బదిలీ కూడా చోటుచేసుకోనుంది.

వివిధ పధకాల పేర్లు మార్పు…నాణ్యతకు పెద్దపీట

ఇప్పటికే తొలి సంతకం చేసిన అవ్వాతాతల పెన్షన్ పధకానికి వైఎస్ జగన్ పేరు మార్చేశారు. ఎన్టీఆర్ భరోసా పధకంగా ఉన్న పేరును వైఎస్సార్ పింఛను కానుకగా మార్చారు. ఇప్పుడు తాజాగా మద్యాహ్న భోజన పధకం పేరును కూడా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది జగన్ ప్రభుత్వం. ఈ పధకానికి వైఎస్సార్ అక్షయపాత్రగా నామకరణం చేసింది ప్రభుత్వం. ఈ పధకం కింద పనిచేసే సిబ్బందికి ఇచ్చే గౌరవ వేతనాన్నికూడా 3 వేలకు పెంచుతూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు.మరోవైపు పిల్లలకు అందించే భోజనం నాణ్యతలో రాజీ పడవద్దని అధికార్లకు గట్టిగా సూచించారు.

పాఠశాల విద్యకు కొత్త దశ…

 జూన్ 12 నుంచి రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.ఈ నేపధ్యంలో రాష్ట్రంలో స్కూలు విద్యకు మహర్ధశ కల్పించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం కృషి చేస్తోంది. స్కూల్ రెడీనెస్ ప్రోగ్రాం సిద్ధమైంది. ప్రైవేటు కార్పొరేట్ విద్యకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యను తీర్దిదిద్దేందుకు జగన్ నిర్ణయించిన నేపధ్యంలో ఇప్పటికే ఆయా జిల్లాల విద్యాధికార్లకు ఈ దిశగా ఆదేశాలు అందాయి. ఒక్కో విద్యార్ధికి మూడ జతల యూనిఫాం, బూట్లు, పాఠ్యపుస్తకాల్ని అందించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 8,9 తరగతులు చదువుతున్న బాలికలకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు. మారుమూల ప్రాంతాల్లోని విద్యార్ధులు కూడా పాఠశాలలకు వెళ్లేందుకు వీలుగా…రవాణా ఖర్చుల కింద అందజేస్తున్న మొత్తాన్ని ప్రస్తుత విద్యా సంవత్సరంలో సైకిళ్ల రూపంలో అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పోరాడి సాధించిన జగన్…

ముఖ్యమంత్రి పీఠాన్ని వైఎస్ జగన్ పోరాడి సాధించుకున్నారు. తొమ్మిదేళ్ల శ్రమకు ఫలితమిది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్ రాజకీయ ప్రస్థానం అనేక ఒడిదుడుకుల మధ్యనే సాగిందని చెప్పాలి.అనేక ఇబ్బందులు, వ్యతిరేకతలకు ఎదురు నిలిచి పోరాడిన వ్యక్తిత్వమే ఆయనను ఇప్పుడు ఈ పీఠంపై కూర్చోబెట్టింది. దేశ రాజకీయ చరిత్రలో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ సాధించని రికార్డును ఆయన సాధించారు.ఎన్నికల్లో 50 శాతం ఓట్లు రావడం ఆశామాషీ వ్యవహారం కాదు. అంతకంటే ఆ మార్కును సాధించిన రాజకీయపార్టీ ఏదీ లేదనే చెప్పాలి. జగన్ తన తొలి అధికారంతోనే ఆ మార్కును దాటేశారు.రాజకీయ వ్యవస్థలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల వ్యూహరచన కోసం పార్టీ నాయకులతో సమాలోచనలు జరుగుతున్న సందర్భంలో కూడా వైఎస్ అన్న మాటలు ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. ఎన్నికలంటే అవతలి పక్షం ఎన్నో ఎత్తుగడలు, మరెన్నో తాయిలాలు ఇస్తుందని…వీటిపై కాకుండా 50 శాతం ఓట్ల మార్కును దాటడైపైనే దృష్టి సారించాలన్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఓట్లు తెచ్చుకోవాలంటే…అంతమందినీ గెలుచుకోవాలన్నారు జగన్ అప్పట్లో. ఒక లక్ష్యమంటూ పెట్టుకున్నాక అవతలివాళ్ల వ్యూహాలతో మనకు పనేంటన్నారు జగన్. ఈ మాటలు పైకి చాలా సింపుల్ గా అన్పిస్తాయి గానీ…కానీ  వాస్తవమిదే. ఎవరికీ తలవంచని వ్యక్తిత్వం..కష్టాలెన్ని వచ్చినా.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమనే తపన… నమ్మిన సిద్ధాంతం, విలువల కోసం నిలబడే వ్యక్తిత్వమే అతన్ని ఈ స్థాయికి చేర్చిందనాలి. తండ్రిని పోగొట్టుకున్నా సరే…చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో…బెదిరింపులకు పాల్పుడుతున్నా తలవంచక ముందుకు సాగిన ఆ వైఖరి చివరికి ప్రజల్లో జేజేలు పలికించింది. ముసుగులో గుద్దులాటలు…తెరవెనుక రాజకీయాలు…ముందొకటి..వెనుకొకటి చేయడాలు ఆయనకు నచ్చవు. ఎన్నికల ముందూ అదే చేశారు. ఇప్పుడూ అదే చేస్తున్నారు జగన్.

జూన్ 8న మంత్రివర్గం ప్రకటన…తొలి సమావేశం కూడా.. 

రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం పూర్తయింది. ఇక మిగిలింది మంత్రివర్గమే. జగన్ కేబినెట్ లో ఎవరెవరు ఉంటారనేదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఆశావహులు చాలామంది ఉన్నా సరే…27 దాటకూడదన్న నిబంధనల నేపధ్యంలో చాలా జాగ్రత్తగా కూర్పు జరుగుతోంది. జిల్లాల వారీ ప్రాతినిధ్యంతో పాటు..సామాజిక సమీకరణ, విధేయత, అనుభవం కూడా ప్రాతిపదిక కానున్నాయి. అనంత వెంకట్రామిరెడ్డి, బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, అంజాద్ బాషా, పెద్దిరెడ్డి, రోజా, అంబటి , కోన రఘుపతి, కూడాలి నాని, పేర్ని నాని, పార్ధసారధి, ఆళ్ల నాని, ప్రసాదరాజు, వనిత, పిల్లి బోసు, కన్నబాబు, బొత్స, ధర్మాన , ఆనం , ఆర్కేల  పేర్లు కచ్చితంగా మంత్రివర్గంలో ఉండనున్నాయి.

జిల్లాకు రెండుకు మించి ఇచ్చే పరిస్థితి లేదు. ఒకట్రెండు జిల్లాలకైతే ఒక్కో మంత్రి పదవే దక్కవచ్చు. తూర్పులో అయతే మూడు మంత్రిపదవులు ఇవ్వవచ్చని తెలుస్తోంది. అదే జరిగితే విశ్వరూప్ కు స్థానం లభించవచ్చు. వీరిలో ఆర్కే , పిల్లి ల పేర్లు ఇప్పటికే ఖరారయ్యాయి. ఏదేమైనా సరే జగన్ మంత్రివర్గంలో 60 శాతం కొత్తవాళ్లు, 40 శాతం పాతవాళ్లతో ఉండేట్టు రూపకల్పన చేస్తున్నట్టు సమాచారం. మైనారిటీలకు రెండు పదవులు ఇచ్చే విషయమై కూడా ఆలోచన చేస్తున్నట్టు…అదే జరిగితే కర్నూలు నుంచి హాఫీజ్ ఖాన్ పేరు పరిశీలనలో రావచ్చు.

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.