రాజాకు మంత్రి అవకాశాలు…

నాడు వైఎస్ కు తండ్రి..నేడు జగన్ కు తనయుడు

కేబినెట్ లో అవకాశాలు…

తూర్పు మార్పునకు సంకేతమంటారు. అటువంటి తూర్పులో ఈసారి వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా సీట్లు దక్కాయి. గత ఎన్నికల్లో ఎక్కడైతే పట్టు సాధించలేకపోయామో అక్కడే…ఆధిక్యత ప్రదర్శించింది పార్టీ. ఉన్న 19 స్థానాల్లో ఏకంగా 14 స్థానాల్ని సాధించి…అధికారానికి కారణమైందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే తూర్పు మార్పునకు సంకేతమన్న బలమైన సెంటిమెంట్ ను ప్రతి ఒక్కరూ నమ్ముతారు కాబట్టి.

మరో నాలుగురోజుల్లో అంటే మే 30 న వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపధ్యంలో జగన్ డ్రీం కేబినెట్ ఎలా ఉంటుందనేదే సర్వత్రా ఆసక్తిగా మారింది. జిల్లాలవారీ అనుభవం, సామాజిక సమీకరణాలే కాకుండా..విశ్వసనీయత, నమ్మకస్థులనే అంశాలపై కూడా కూర్పు ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే మంత్రివర్గ రేసులో బొత్స, ధర్మాన, బుగ్గన, రోజా, పెద్దిరెడ్డి, కొడాలి నాని, అంజాద్ బాషా, పిల్లి సుభాష్ చంద్రబోస్, విశ్వరూప్ వంటినేతల పేర్లు అనుభవమనే అంశంపై విన్పిస్తున్నాయి. అదే సమయంలో నమ్మకస్తులు, కుటుంబాన్ని వెన్నంటి ఉన్ననేతల అంశంలో కూడా కూర్పు జరుగుతుందని తెలుస్తోంది. ఈ అంశంపై కూర్పు జరిగినప్పుడు ఆ రేసులో తొలిగా విన్పిస్తున్న పేరు జక్కంపూడి రాజా. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా, పోటీ చేసిన తొలి ఎన్నికలోనే 31 వేల భారీ మెజార్టీతో నెగ్గడమే కాకుండా టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టగలిగారు. యువకుడు, విద్యావంతుడు కావడం అదనపు అర్హతైతే…జగన్ కు తమ్ముడిలా ఉండటం అసలు సంగతి. నేరుగా అందరి ముందు కూడా జగన్.. రాజాను తమ్ముడిలానే పిలుస్తారు. జక్కంపూడి విజయలక్ష్మిని అమ్మా అంటూ సంబోధిస్తారు.

మార్పనకు సంకేతమైన తూర్పులో జగన్ కు ఓ ఆశా కిరణం వంటివాడు జక్కంపూడి రాజా. అంతకు మించి పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆ పార్టీనే వెన్నంటి ఉన్న కుటుంబం జక్కంపూడి కుటుంబం. నాడు జగన్ తండ్రి వైఎస్ ప్రతిపక్షనేతగా ఎన్నిక కానప్పటి నుంచి అంటే….వైఎస్ తొలిసారి ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచీ తూర్పు గోదావరి జిల్లాలో వైెఎస్ కు వీరాభిమానిగా, అనంతరం అత్యంత సన్నిహితుడిగా మారారు జక్కంపూడి రామ్మోహన్ రావు. టీడీపీ ప్రభంజనంలో కూడా జిల్లాలో గెలిచిన ఏకైన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉంటూ….వైఎస్ ఆశయాల్ని ముందుకు నడిపించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు నాడు. మహానేత వైఎస్ పాదయాత్ర సమయంలో జక్కంపూడి జిల్లాను నడిపించిన తీరు ఇప్పటికీ మరవలేం. వైఎస్ కు ఓ మంచి నమ్మకస్తుడు గోదావరి జిల్లాల్లో ఎవరైనా ఉన్నారంటే అది జక్కంపూడి రామ్మోహన్ రావే కావడం విశేషం. అందుకే అధికారంలో వచ్చిన వెంటనే ముందుగా ప్రకటించిన కేబినెట్ లో జక్కంపూడికి అగ్రస్థానం కల్పించారు వైఎస్. అనంతరం అనారోగ్యం బారిన పడటంతో తాను పోటీకి దూరమై సతీమణి జక్కంపూడి విజయలక్ష్మిని బరిలో దింపారు 2009లో. ఈ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ కారణంగా ఓటమి పాలైనా…జక్కంపూడి కుటుంబ ప్రాధాన్యతను మాత్రం వైఎస్ తగ్గించలేదు. రాజమండ్రి సుబ్రహ్మణ్యమైదానం వద్ద వైఎస్ రెండోసారి సీఎంగా వచ్చినప్పుడు ఆయన జారీ చేసిన ఆదేశాలు జక్కంపూడి రామ్మోహన్ రావుకు ఇచ్చే ప్రాధాన్యతను సూచిస్తుంది. జిల్లాకు ఏ మంత్రి, ఏ నేత వచ్చినా…ముందుగా జక్కంపూడి రామ్మోహన్ రావు ఇంటికెళ్లి..ఆయన ఆరోగ్య విషయాలు తెలుసుకోవాలని అప్పట్లో వైఎస్ సూచించారు. అదీ ఆ ఇద్దరి మధ్య ఉన్న సఖ్యత. అనుబంధం. ఒకరిపై మరొకరికున్న నమ్మకం.

అనంతర కాలంలో పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచీ జగన్ వెంట నడిచింది తొలిగా జక్కంపూడి కుటుంబమే. నాడు తండ్రి వైఎస్ తో కలిసిన ఆ కుటుంబం అనంతరం తనయుడు జగన్ తో ముందుకు నడిచింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా బరిలో దిగుతూనే టీడీపీ కంచుకోటగా చెప్పుకునే రాజానగరం నుంచి 31 వేల భారీ మెజార్టీతో గెలుపొందారు జక్కంపూడి రాజా. వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా నియోజకవర్గాన్ని ఓ వైపు చూసుకుంటూనే మరోవైపు జిల్లాను, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల యువజన విభాగాల పటిష్టతకు రాజా చేసిన కృషి మరువలేనిది. ఈ ఎన్నికల్లో రాజమండ్రి సిటీ, రూరల్ స్థానాల్లో పార్టీ గెలవకపోయినా…రాజమండ్రి ఉత్తరంగా చెప్పుకునే రాజానగరంపై మాత్ర రాజా పట్టు సాధించేశారు. పార్టీ నుంచి గెలిచిన సీనియర్లు జిల్లాలో మరి కొంతమంది ఉన్నా సరే…నమ్మకం, విశ్వసనీయత అంశాల్లో మాత్రం రాజాకే అవకాశాలుంటాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. సీనియర్ల పరంగా పిల్లి సుభాష్ చంద్రబోస్, విశ్వరూప్ వంటి నేతలుంటే…నమ్మకస్థుడైన యువ విద్యావంతుల జాబితాలో రాజా పేరు అగ్రస్థానంల ో  ఉంటుంది. తూర్పు గోదావరి జిల్లా నుంచి జక్కంపూడి రాజాకు కేబినెట్ లో అవకాశాలపై ఎటు నుంచి లెక్కేసుకున్నా అనుకూలంగానే ఉంటుందన్నది అత్యధికులు చెప్పే మాట.

తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పుడు ఎక్కువగా విన్పిస్తున్న మాట కూడా అదే. రాజాకు కేబినెట్ అవకాశాలున్నాయన్నది. వైెఎస్ జగన్ అంటే చెవి కోసుకునే నమ్మకస్థుడిగా ఉండటమే అతనికి ప్లస్ గా మారిందనేేది విశ్లేషకుల మాట. అటు జగన్ కూడా రాజాపైనే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు ఈ జిల్లా వరకూ.  కాపు సామాజికవర్గం సమీకరణంలో అయినా…విద్యావంతుల కోటాలో అయినా, యువకుల కోటాలో అయినా…అన్నింటికి మించి తన తండ్రి వైఎస్ నుంచి నమ్మకమైన కుటుంబమనే విషయంలో అయినా సరే…రాజాకు మంత్రి పదవిపై జగన్ ఆలోచన చేయాలని వైసీపీ అభిమానులు కోరుతున్నారు. సోషల్ మీడియా సాక్షిగా తమ అభిమతాన్ని అధినేత జగన్ కు తెలుపుకుంటున్నారు.

ఇదే జిల్లాలో కురసాల కన్నబాబు పేరు విన్పిస్తున్నా సరే…పార్టీ స్థాపనకు ముందు నుంచీ జగన్ ను వెన్నంటి నడిచింది మాత్రం జక్కంపూడి రాజా కుటుంబమే కావడం అదనపు అర్హత గా ఉంది. అన్నింటికీ మించి రాజాకు మంత్రి పదవి ఇచ్చే పక్షంలో జిల్లా నుంచి ఏ మాత్రం వ్యతిరేకత గానీ, కనీసం అసంతృప్తి గానీ రాదన్నది కూడా అంతే సత్యం.

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.