మే 30 న జగన్ ప్రమాణ స్వీకారం…

జగన్ ప్రభంజనంలో కొట్టుకుపోయిన సైకిల్…

85 శాతం సీట్లతో రికార్డు సృష్టించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ…

కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాలన్నది ఓ సినిమా డైలాగ్ అయినా…అదే జరిగింది ఏపీ ఎన్నికల ఫలితాల్లో. ఫ్యాన్ గాలికి తగిలిన దెబ్బకు ప్రత్యర్ధులకు బైర్లు కమ్మాయి. చంద్రబాబు తనయుడు లోకేష్ సహా…మంత్రులంతా ఓటమి పాలయ్యారు. సంతలో పశువుల్లా అమ్ముడుపోయిన నేతలకు జనం బుద్ధి చెప్పారు. జననేత జగన్ కు ఒక్క ఛాన్స్ ఇద్దామనుకున్నారు. ఇచ్చేశారు. తొమ్మిదేళ్ల జగన్ శ్రమకు గుర్తించిన ప్రజలు అమోఘమైన తీర్పిచ్చారు. జగన్ సోదరి షర్మిల చెప్పినట్టు బాబుకు బైబై చెప్పారు. అఖరికి పప్పుకు కూడా.

ప్రత్యర్దులకు…విశ్లేషకులకు..ఎగ్జిట్ పోల్స్ సర్వేలకు సైతం అందని భారీ విజయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాధించింది. ఏపీలోని 175 స్థానాల్లో ఏకంగా 151 స్థానాల్ని గెల్చుకుంది. 25 లోక్ సభ స్థానాల్లో 22 చోట్ల విజయ కేతనం ఎగురవేసింది. జన సునామీ సృష్టించింది. మొత్తం దేశాన్ని ఆకర్షించిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ప్రజలంతా ఒక్కటై..ఒకే తీర్పు ఇచ్చారు. జగన్ మోహన్ రెడ్డికి పట్టం కట్టారు. ఏప్రిల్ 11 న జరిగిన పోలింగ్ అనంతరం దాదాపు 43 రోజుల తీవ్ర ఉత్కంఠ నడుమ…జరిగిన ఓట్ల లెక్కింపులో తొలి రౌండు నుంచే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  అధిపత్యాన్ని ప్రదర్శించి..చివరి వరకూ నిలుపుకుంది. అధికార తెలుగుదేశం పార్టీ పూర్తిగా చతికిలపడింది. ఇటు శాసనసభ అటు లోక్ సభ ..రెండింటిలోనూ ఘోర పరాజయం మూటకట్టుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ తో సహా కీలకమైన నేతలు, మంత్రులు ఓటమిపాలయ్యారు. కేవలం చినరాజప్ప, అచ్చెన్నాయుడు తప్ప మిగిలిన మంత్రులకు ప్రజలు చెక్ చెప్పారు. ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వ అవినీతికి ప్రజలకు చరమ గీతం పాడేశారు. ఆ పార్టీ రహస్య స్నేహితుడిగా ముద్రపడిన జనసేన పూర్తిగా కుప్పకూలడమే కాకుండా…పార్టీ అధినేతను రెండు స్థానాల్లోనూ ఓటమి పాలవడం ఆ పార్టీ కేడర్ కు జీర్ణించుకోలేని విషయంగా మారింది. కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాపాక వరప్రసాద్ స్వల్ప మెజార్టీ 811 ఓట్లతో తప్ప..మరెవరూ గెలుపొందలేదు. ఊహించనట్టే కాంగ్రెస్ పార్టీ గానీ, బీజేపీ గానీ పూర్తిగా మట్టికరిచాయి. 160కి పైగా స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు.

ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలను అంటే 85 శాతానికి పైగా నియోజకవర్గాల్లో విజయ దుందుబి మోగించింది.  తెలుగుదేశం మాత్రం కేవలం 24 స్థానాలకు పరిమితం కావలసి వచ్చింది. జిల్లాల వారిగా ఫలితాలను గమనిస్తే…గతంలో టీడీపీకు మద్దతుగా నిలిచిన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, అనంతపురంలలో చావుదెబ్బ తగిలింది. కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో టీడీపీ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయిందంటే…ప్యాన్ సునామీ ఎలా ఉందో తెలుస్తుంది. ఆఖరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూడా కుప్పం నియోజకవర్గంలో ఈసారి మెజారిటీ తగ్గింది. ఇటు జనసేన కొన్ని స్థానాల్లో మూడో స్థానంలో నిలవగా…చాలా స్థానాల్లో అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. బీజేపీ నామమాత్రం పోటీ కూడా ఇవ్వలేక మూలన పడింది.

చక్రం తిప్పలేక చతికిలపడిన బాబు…

ఈ ఎన్నికలకు చంద్రబాబు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. పోలింగ్ రోజునే సరళిని పసిగట్టిన బాబు…ఈవీఎంలపై పోరాటమంటూ నానా రభస చేశారు. మోదీ పై యుద్ధమంటూ… యూపీఏకు ప్రజలు పట్టం కడతారనుకుని..అన్ని పక్షాలను ఏకం చేసి చక్రం తిప్పుతానింటూ బయలుదేరారు. గత కొద్ది రోజులుగా ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఆయా పార్టీల నేతలను కలుస్తూ వచ్చారు. ఇదే సమయంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో  పార్టీ ఓటమి తప్పదని తెలిసినా…మేకపోతు గాంభీర్యంతో 150 సీట్లు గెలిచి తీరుతామంటూ ప్రగల్భాలు పలికారు. తనకు సన్నిహితుడైన లగడపాటి రాజగోపాల్ తో పోస్ట్ పోల్ సర్వే పేరుతో ఫలితాలను ప్రకటించుకున్నారు. చివరికి దేశంలో చక్రం తిప్పుతానని బయలుదేరిన బాబు…సొంత రాష్ట్రంలో తన సైకిల్ చక్రాన్నే తిప్పలేకపోయారు. ప్రజలు స్పష్టమైన తీర్పునివ్వడంతో ఖంగుతిన్నారు. ఆయన అంచనాలను  అందని విధంగా రాష్ట్ర ప్రజలు కు గట్టి షాకిచ్చారు. గత ఎన్నికల్లో చాలా జిల్లాల్లో మెజారిటీ సీట్లు సాధించిన టీడీపీ ఈసారి మాత్రం వెనుకబడిపోయింది. ఉత్తరాంధ్ర నుంచి మొదలుకుని…రాయలసీమ వరకు అన్ని ప్రాంతాల్లోనూ వైసీపీ అదిపత్యం  స్పష్టమైంది.

ఏ జిల్లాలో ఎన్ని స్థానాలు…

వైఎస్ జగన్  ప్రతిపక్ష నేతగా గత ఐదేళ్లుగా సాగించిన అనేక ఆందోళనలు, ప్రతి నిత్యం ప్రజల్లో ఉండటం, ఎండనక, వాననక, చలి అనక…3 వేల 648 కిలోమీటర్ల సుదీర్ష పాదయాత్ర సాగించిన తీరును ప్రజలు గమనించారు. తమ కోసం కష్టపడుతున్న జగన్ కు ఒక్క అవకాశమిద్దామనుకున్నారు.  ప్రజల్లో వచ్చిన ఆ ఆలోచన ఫలితమే ఈ ఎన్నికల ఫలితాలు.  శ్రీకాకుళం  జిల్లాలోని 10 స్థానాల్లో 8, విజయనగరంలోని 9 కు 9,  విశాఖ లోని 15 స్థానాల్లో 11, తూర్పు గోదావరిలోని 19 లో 14, పశ్చిమ గోదావరి లోని 15లో 12, కృష్ణాలోని 16లో 13, గుంటూరు జిల్లాలోని 17 స్థానాల్లో 14, నెల్లూరులోని 10లో 10, ప్రకాశం లోని 12 లో 8, అనంతపురంలోని 14లో 12, కడప జిల్లాలోని 10కు 10, కర్నూలులోని 14కు  14, చిత్తూరులోని 14లో 13 స్థానాల్లో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసింది. వైసీపీ ప్రభంజనంతో రాష్ట్రంలోని ఏ జిల్లాలోనూ టీడీపీ పట్టు సాధించలేకపోవడం గమనించాల్సిన అంశం.

25న శాసన సభా పక్ష సమావేశం…30 న ప్రమాణ స్వీకారం…

వైసీపీ ఘన విజయంతో తాడేపల్లిలోని  జగన్ నివాసం మరియు ఉండవల్లిలోని పార్టీ కార్యాలయం వద్ద పార్రీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు, నేతలు పెద్దఎత్తున చేరుకున్నారు. ఫలితాల సరళి చూస్తూనే భారీగా తరలివచ్చారు. సంబరాలు చేసుకున్నారు. సాయంత్రం పార్టీ అధ్యక్షుడు జగన్ మీడియాతో…అభిమానులతో మాట్లాడారు. నిలువెత్తు ఆత్మ విశ్వాసంతో చెప్పిన నాలుగు మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ భారీ విజయం ఊహించిిందేనన్నారు. ప్రజలు విశ్వసనీయతకు పట్టం కట్టారని చెప్పిన జగన్… ప్రజలిచ్చిన తీర్పుతో తనపై పెట్టిన విశ్వాసాన్ని బాధ్యతను మరింత పెంచిందన్నారు. పట్టం కట్టిన ప్రజలకు  ఆయన చేతులు జోడించి సవినయంగా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పార్టీ ముఖ్యులతో సమావేశమై.. ఈ నెల 25 వ తేదీన పార్టీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.  ఆ సమావేశంలో పార్టీ శాసనసభా పక్ష నేతను ఎన్నుకుంటారు.  ఆ తరువాత జగన్ నేతృత్వంలో పార్టీ ప్రతినిధి బృందం గవర్నర్ ను కలవనున్నారు. అనంతరం గవర్నర ఆహ్వానం మేరకు ఈ నెల 30 న మంత్రివర్గ, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార మహోత్సవం జరగనుంది.

పార్టీ తరపున గెలిచిన మహిళా అభ్యర్ధులు..

ఈ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు చాలానే వచ్చాయి. మంత్రులంతా ఓటమి పాలయ్యారు. అటు వైసీపీ తరపున పోటీ చేసిన మహిళా అభ్యర్ధుల్లో 90 శాతం పైగా విజయం సాధించారు. పార్టీ తరఫున మొత్తం 15 మంది పోటీ చేయగా 13 మంది విజయం సాధించారు. నగరి నుంచి ఆర్‌.కె. రోజా, పాతపట్నం నుంచి రెడ్డి శాంతి, పాలకొండ నుంచి  కళావతి, కురుపాం నుంచి పాముల పుష్ప శ్రీవాణి, పాడేరు నుంచి కె. భాగ్యలక్ష్మి, రంపచోడవరం నుంచి నాగులపల్లి ధనలక్ష్మి, కొవ్వూరు నుంచి తానేటి వనిత, ప్రత్తిపాడు నుంచి మేకతోటి సుచరిత, చిలకలూరిపేట నుంచి విడదల రజిని, పత్తికొండ నుంచి కె. శ్రీదేవి, సింగనమల నుంచి జొన్నలగడ్డ పద్మావతి, కళ్యాణదుర్గం నుంచి కేవీ ఉషా శ్రీచరణ్‌ ఎన్నికల బరిలో దిగి గెలుపొందారు. అదే సమయంలో టీడీపీ 19 మంది మహిళా అభ్యర్థులు బరిలో నిలపగా…ఒకరు మాత్రమే గెలుపొందారు.​

సోదరులిద్దరి ఓటమి…లోకేశ్ సహా మంత్రుల ఓటమి…

చంద్రబాబు రహస్య స్నేహితుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు, అతన ిసోదరుడు నాగబాబుకు ప్రజలు నిజంగానే సినిమా చూపించేశారు. అనేక రకాల లెక్కలు…సమీకరణాలు వేసుకుని, కాపు ఓటింగ్ అధికంగా ఉన్న భీమవరం, గాజువాక నియోజకవర్గాల్ని ఎంచుకుని…రెండింటిలోనూ పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కు ప్రజలు ఆదరించలేదు. భీమవరంలో వైసీపీ అభ్యర్ధి గ్రంధి శ్రీనివాస్ చేతిలోనూ…గాజువాకలో వైసీపీ అభ్యర్ధి తిప్పల నాగిరెడ్డి చేతిలోనూ ఓటమి చవి చూడాల్సి వచ్చింది పవన్ కు. మరోవైపు ఎన్నికలు మరి కొన్నిరోజులుందనగా…పార్టీ కండువా కప్పుకుని నరసాపురం ఎంపీగా బరిలో దిగిన అతని సోదరుడు నాగబాబును కూడా ప్రజలు ఇంటికి పంపేశారు. ఈ స్థానం నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్ధి రఘురామకృష్ణం రాజు చేతిలో ఘోరంగా ఓడిపోవడమే కాకుండా మూడో స్థానానికి పరిమితమయ్యారు.

అన్నింటికి మించి అనూహ్య ఫలితం మంగళగిరి నియోజవర్గానిదని చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన మంత్రి, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఇక్కడి నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్ధి ఆళ్ల  రామకృష్ణారెడ్డి చేతిలో 5 వేల 312 ఓట్ల తేడాతో ఓడిపోయారు లోకేష్. మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేశ్‌ ను పోటీ చేయించాలని నిర్ణయించిన తర్వాత చంద్రబాబు రహస్య స్నేహితుడైన పవన్ కళ్యాణ్ కూడా టీడీపీకు మేలు చేశారు. జనసేన అక్కడి నుంచి పోటీ చేయకుండా…పొత్తు పేరుతో ఆ స్థానాన్ని సీపీఐకి కేటాయించింది. పొత్తు ధర్మంలో భాగంగా కనీసం పవన్ అక్కడికి ప్రచారానికి కూడా వెళ్లలేదు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు చేయని ప్రయత్నం లేదు. టీడీపీ గరిష్టంగా ఓటుకు 4 నుంచి 5 వేలు ఇచ్చిన పరిస్థితి ఉంది ఈ నియోజకవర్గంలో. మరోవైపు కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల్లో ఏసీలు, ఫ్రిజ్ లు, వాషింగ్ మెషీన్లను కూడా అందించారు. అయినా సరే…ప్రజాతీర్పు ముందు ఇవేమీ పనిచేయలేదు. లోకేష్ తో పాటు ఓటమి పాలైన మంత్రుల్లో కాల్వ శ్రీనివాసులు, ప్రత్తిపాటి పుల్లారావు, జవహర్, దేవినేని ఉమ, పితాని సత్యనారాయణ, గంటా శ్రీనివాసరావు, కేఈ కృష్ణమూర్తి, అఖిలప్రియ తదితరులంతా ఉన్నారు.

ఆకట్టుకున్న షర్మిల ప్రసంగం…

ఎన్నికల్లో ప్రజల్ని విపరీతంగా ఆకట్టుకున్న అంశాల్లో ప్రధానంగా చెప్పుకోవల్సింది జగన్ సోదరి షర్మిల గురించి. జగనన్న సంధించిన బాణాన్నంటూ గత ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసిన ఆమె…తిరిగి ఈ ఎన్నికల సందర్భంగా ప్రచారం నిర్వహించారు. వైఎస్‌ విజయమ్మ, షర్మిల కలిసి మొత్తం 66 సభల్లో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. కేవలం 20 రోజుల పర్యటనలో వైఎస్‌ విజయమ్మ 27, షర్మిల 39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాల్గొన్నారు. బాబు వస్తే జాబు రాలేదు కానీ కరువు వచ్చిందని..యువతకు ఉద్యోగాల్లేవు గానీ..ఎటువంటి అనుభవం లేని సీఎం తనయుడు లోకేశ్‌కు మాత్రం మూడు ఉద్యోగాలు వచ్చాయని ఆమె చేసిన ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది. ఆఖరిగా  ఆమె పదే పదే చెప్పిన మాటలైతే సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయ్యాయి. ప్రజాతీర్పు కావాలి.. బై బై బాబు..ఆఖరికి పప్పు కూడా అనేది ఎంతగా వైరల్ అయిందో..అంతగా ఆకట్టుకుంది అందర్నీ.

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.