కాబోయే సీఎంకు భారీ భద్రత…

తాడేపల్లి చేరుకున్న జగన్…

ఇంటెలిజెన్స్ ఆదేశాల మేరకు భారీ భద్రత..

కౌంటింగ్ కు మరి కొన్ని గంటల వ్యవధి మాత్రమే మిగిలుంది. ఇప్పటికే విశ్లేషణలు..ఎగ్జిట్ పోల్స్ జగన్ కు పట్టం కట్టేశాయి. కాబోయే సీఎంగా జనంలోకి వెళ్లిపోయింది. అందుకే భారీ భద్రతతో ముందుకు కదులుతున్నారు జగన్ ఇప్పుడు. ఇంటెలిజెన్స్ ఆదేశాలతో ఏపీ పోలీసు భారీ భద్రత కల్పించింది.

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ప్రతిపక్ష నేత , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తాడేపల్లి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్న ఆయనకు విమానాశ్రయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు,అభిమానులు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. అభిమానుల సందోహం వెంటరాగా…అక్కడ నుంచి నేరుగా రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని తన నివాసానికి వచ్చారు జగన్. దారిపొడవునా… అభిమాన నేతకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు కాబోయే సీఎం అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో తాడేపల్లిలోని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ మేరకు గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు జడ్‌ క్యాటగిరీ ఉన్నందున.. ఆ మేరకు పోలీసు సిబ్బందిని నియమించాలని, బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని ఏర్పాటు చేయాలని కోరింది. హైదరాబాద్‌లోని తన ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి రాజీవ్‌గాంధీ విమానాశ్రయం వరకూ ఈ భద్రతా ఏర్పాట్లు సమకూర్చాలని ఏపీ ఇంటెలిజెన్స్ కు చెందిన అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు  సందేశం మేరకు..తెలంగాణా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. తిరిగి గన్నవరం విమానాశ్రయం నుంచి గుంటూరు జిల్లాలోని తాడేపల్లి నివాసానికి చేరుకున్నపుడు కూడా అదే నిబంధనలను అనుసరించి భద్రతను, బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని సమకూర్చారు. రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి బలంగా వీస్తుందంటూ ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించడంతో…ఫలితాల  అనంతరం జగన్ నివాసానికి అభిమానులు  భారీగా చేరుకునే అవకాశం ఉండటంతో… ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ‍్రత‍్తలు చేపట్టారు.

ట్విట్టర్ లో సాయిరెడ్డి చురకలు…

మరోవైపు యధావిధిగా ట్విట్టర్ వేదికగా వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చంద్రబాబుపై చురకలు అంటిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎన్నికల కౌంటింగ్‌ను నిలిపి వేయించడానికి చంద్రబాబునాయుడు చేయని కుతంత్రం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మండిపడ్డారు. వీవీప్యాట్ల లెక్కింపు పేరుతో రెండు సార్లు సుప్రీంలో పిటిషన్ వేసి ఓడిపోయాడన్నారు. తన అనుకూల వ్యక్తులతో ఏపీ హైకోర్టు, సుప్రీం కోర్టులో మరోసారి అత్యవసర పిటిషన్లు దాఖలు చేయించినా అవి తిరస్కరణకు గురయ్యాయని ట్విటర్‌లో చురకలంటించారు.

మే 23వ తేదీతో రాజకీయ నిరుద్యోగిగా మారనున్న చంద్రబాబు కొత్త  పని కోసం ఎక్కని గడప, దిగని గడప లేదన్నట్టు తిరుగుతున్నాడని.. ఈయనకు ఉపాధి కల్పించే స్థితిలో అక్కడెవరూ లేరని చెప్పారు. అక్కడున్నవాళ్లే అసలు ఉద్యోగం లేకనో, సగం పనితోనో కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. ఒక ప్రయోజనకరమైన కార్యక్రమం కోసం ప్రయాణాలు చేస్తే అందరూ ప్రశంసిస్తారని…అయితే చంద్రబాబు తిరుగుళ్లు మాత్రం ఊసుపోక చేస్తున్న దేశదిమ్మరి యాత్రల్లా ఉన్నాయన్నారు. ఓటమి తప్పదని తెలిసి తనను తాను ఊరడించుకునేందుకు ప్రాంతీయ నేతల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడంటూ విమర్శించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లకు అనుబంధంగా అమర్చిన ప్రింటర్‌లాంటి పరికరాలే వీవీప్యాట్లని… ఈవీఎంలలో నమోదైన ఓట్ల ఆధారంగానే లెక్కింపు ఉంటుందని ఈసీ సైతం చెప్పిందన్నారు. వీవీప్యాట్లను ముందు లెక్కించాలనే వాదన చూస్తే, గుర్రం బలంగా ఉందో లేదో చూడకుండా దాని తోకను కొలవాలనే మూర్ఖపు డిమాండులాగా కనిపిస్తోందంటూ చురక అంటించారు సాయిరెడ్డి.  సోనియా గాంధీ సహా..ఉత్తరాది నేతలకు కూడా సీన్ అర్థమైందని…అందుకే మాయా, స్టాలిన్లు  అటువైపు దూకేందుకు సిద్ధమవుతుంటే…ఫెవికాల్ బాబా మాత్రం ఇవేమీ పట్టనట్టు ప్రభుత్వ ఏర్పాటు చేస్తామని..రాష్ట్రపతికి లేఖ ఇద్దామని చెబుతున్న బాబు మానసిక స్థితిని అనుమానిస్తున్నారని  విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు.

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.