విజయ రహస్యమిదే….

అధికారం నూటికి నూరుపాళ్లూ వైసీపీదే…

ఎగ్జిట్ పోల్స్ ను బట్టి కాదు…అసలు సంగతిదీ..

ఓదార్పుయాత్రతో మొదలైన ఆ అకుంఠిత దీక్ష..మొన్నటి పాదయాత్ర వరకూ సాగింది. తొమ్మిదేళ్ల నిరీక్షణ..ప్రతిక్షణం ప్రజల్లో.. అనునిత్యం ప్రజా సమస్యలపై పోరాటం..ఓ వైపు పార్టీ నిర్మాణం..మరోవైపు కేడర్ లో ఆత్మ స్థైర్యం నింపుకుంటూ రావడం. విలువలతో కూడిన రాజకీయాల కోసం పడిన శ్రమ. కష్టమంతా ఆ ఒక్కడిదే. ఒకే ఒక్కడుగా పార్టీ స్థాపించాడు. ఒక్కడై నడిపాడు. తానే ఓ దిక్చూచిగా మారాడు. దిశా నిర్దేశం చేస్తూ ముందుకు సాగాడు. మరి కొన్ని గంటల్లో వెలువడనున్న ప్రజా ఫలితం ఆ నాయకుడికే పట్టం కట్టనుంది. ఔను..ముమ్మాటికీ నిజమే. వైఎస్ జగన్ అనే నేను మాటను కోట్లాది అభిమానులు విననున్నారు.

రాష్ట్ర ప్రజలు వైఎస్‌ జగన్‌ నిజాయితీ, నిబద్ధతకు..విలువలతో కూడిన రాజకీయాలకు పట్టంగట్టారు. రాష్ట్రమంతా వీచిన ఫ్యాన్ గాలితో భారీ మెజార్టీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  దాదాపు ఖాయమైంది. ఇక ఫలితాలు వెలువడటమే ఆలస్యం.  జాతీయ ఛానెళ్ల సర్వే ఫలితాల్ని బట్టి కాదు. జగన్ చేసిన శ్రమకు తగిన ఫలితమిది. 2011లో పార్టీ స్థాపనకు ముందు నుంచి మొదలైన ఓదార్పుయాత్ర రాష్ట్రంలో అప్పట్లోనే ఓ సంచలనమైంది. ఒక్కడిని చూసి ఓర్వలేని ప్రత్యర్ధులంతా ఒక్కటయ్యారు. చేయని కుతంత్రం లేదు. చేయని దగా లేదు. ఎల్లో మీడియా సహాయంతో లేనిది ఉన్నట్టు చూపుతూ..జగన్ ను ప్రజల్నించి దూరం చేసే ప్రయత్నాన్ని అప్పట్నించి చేస్తూనే వచ్చారు. కేసుల పెట్టారు. జైలుకు పంపారు. విధేయతంటే బానిసత్వం కాదన్న తండ్రి మాటల్ని కరాఖండీగా విన్పించారు. తాను నమ్మిన…తానిచ్చిన మాటపై నిలబడ్డారు. పార్టీ స్థాపించారు. గత ఎన్నికల్లో కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో అధికారాన్ని కోల్పోయారు. అప్పటికీ ఆగని ప్రత్యర్ధులు సంతలో పశువుల్ని కొన్నట్టు పార్టీ పతాకంపై గెలిచిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. జగన్ ను ఒంటరి చేయడానికి అలుపెరుగని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయినా వెన్నుచూపకుండా ముందుకే సాగారు జగన్. నిరంతరం ప్రజల మధ్యే ఉండటానికి ప్రయత్నించారు. 2017 నవంబర్ నెలలో మొదలెట్టిన ఆ సుదీర్ఘ పాదయాత్ర జగన్ ను మరింత రాటు దేల్చింది. పాదయాత్రతో వైఎస్‌ జగన్‌ ప్రజలకు మరింత దగ్గరయ్యారు. ప్రజలు సైతం జగన్ పడుతున్న కష్టాన్ని గమనించారు. మండుటెండలో జడిలో..చలిలో విరామమెరుగక పరిశ్రమిస్తున్న జగన్ ను చూసి ఒక్క అవకాశమిద్దామనుకున్నారు. ప్రతిపక్ష నేత చేస్తున్న గ్రౌండ్ వర్క్‌ ఫలించింది. ఏప్రిల్ 11న జరిగిన పోలింగ్ లో భారీగా తరలివచ్చి ఓటేశారు.

ఈ శ్రమకు ఫలితమే వైఎస్సార్‌ సీపీ ప్రభంజనం సృష్టించనుందని జాతీయ మీడియా చానళ్లు పలు సర్వేల ద్వారా వెల్లడించిన నివేదికలు. కేవలం ఎగ్జిట్ పోల్స్ ను నిర్వహించడమే కాదు…ప్రజలు నీరాజనం పలకడానికి కారణాన్ని కూడా ఆ ఛానెళ్లే విశ్లేషించాయి. వైఎస్‌ జగన్‌ నిజాయితీ, నిబద్ధతకు పట్టంగట్టారని, మూడింట రెండు వంతులకుపైగా మెజార్టీతో ఆయన అత్యధిక స్థానాలను సాధిస్తారని తెలిపాయి. ఎగ్జిట్‌పోల్స్‌ విడుదలైన నేపథ్యంలో  ఎన్నికల ఫలితాలపై జరిగిన చర్చాగోష్టుల్లో కూడా ఇదే విషయాన్ని ప్రముఖ సెఫాలజిస్టులు, రాజకీయ విశ్లేషకులు, సీనియర్‌ జర్నలిస్టులు విశ్లేషించారు. ఏపీలో జగన్‌ను ఎదుర్కొనే ధైర్యం లేకనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాలంటూ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని శివసేన పార్టీ పత్రిక సామ్నా తాజా సంపాదకీయంలో వ్యాఖ్యానించడం దీనికి అద్దం పడుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం వైఫల్యాలు, అవినీతి, శాంతి భద్రతల వైఫల్యంపై జగన్‌ గట్టిగా పోరాడారని, నవరత్నాల ద్వారా అన్ని వర్గాలకు ఆయన చేరువయ్యారని హిందూస్తాన్‌ టైమ్స్‌ వెల్లడించింది. ఇదే సమయంలో లగడపాటి సర్వేపై జనం దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ సర్వేను మాత్రమే నమ్ముతామని…ఇతర సర్వేల్ని నమ్మమని చెప్పడం దేనికి సంకేతమో చెప్పాలని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

ఎవరేమన్నారు…

ఈ ఎన్నికల్లో  వివిధ రాష్ట్రాల్లో…వివిధ పార్టీలు క్లీన్ స్వీప్ చేసే వాటిలో వైఎస్సార్ కాంగ్రెస పార్టీ ప్రధమస్థానంలో ఉంటుందని స్వరాజ్‌ ఇండియా జాతీయ అధ్యక్షుడు యోగీంద్ర యాదవ్‌∙ పేర్కొనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు.  వైఎస్‌ జగన్‌ నిజాయితీ, నిబద్ధతలకు తగిన ప్రతిఫలం లభించనుందని యాక్సిస్‌ మై ఇండియా ఎండీ ప్రదీప్‌ గుప్తా చెప్పడం గమనించాల్సిన అంశం. ఎన్నికలకు మరో  నాలుగు నెలలుందనగానే…జగన్‌ ప్రణాళికాబద్ధంగా చేసిన క్షేత్రస్థాయి పని, పాదయాత్రతో ప్రజలకు దగ్గరవడం వైఎస్సార్‌సీపీ పట్ల ఆదరణ పెరగటానికి కారణాలుగా ఆయన విశ్లేషించారు. జగన్‌ అవిశ్రాంత కృషి, పార్టీ పునర్నిర్మాణంతో క్షేత్ర స్థాయిలో బలపడిందని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు సందీప్‌ శాస్త్రి తెలిపారు. 2014 ఎన్నికల్లో వైసీపీ ఉత్తర కోస్తాలో కేవలం ఒక శాతం ఓట్ల తేడాతో సీట్లు కోల్పోగా…ఈసారి ఎన్నికల్లో ఆ పార్టీకి ఏకంగా 45 శాతం ఓట్లు పడ్డాయని…అధికార టీడీపీకి మాత్రం కేవలం 38 శాతం ఓట్లే దక్కాయన్నారు.. ఓట్లలో7- 8 శాతం మార్పు వచ్చిందంటే…దాని ప్రభావం దాదాపు 70 సీట్ల వరకూ ఉంటుందంటున్నారు. ఈ ఎన్నికల్లో ఓటమిని గ్రహించే…బాబు రాజకీయ అభద్రతతోనే ఢిల్లీ వైపు చూస్తూ…ప్రదక్షిణాలు చేస్తున్నారని సీనియర్‌ జర్నలిస్టు టీఎం వీరరాఘవన్‌ స్పష్టం చేశారు. మరో సెఫాలజీ సంస్థ సీఎస్ డీస్ ప్రకారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 110 స్థానాలు సాధించనుందని తేలింది.  ఈ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల శాంపిల్స్‌ను పరిగణలో తీసుకుంది. 2014లో తెలుగుదేశం పార్టీకి 42 శాతం ఓట్లు రాగా..ఈసారి 36 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయని ఆ సంస్థ చెబుతోంది. చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మలేదని..అన్ని జిల్లాలను సమానంగా చూడటం లేదనేది ప్రజలు గుర్తించారన్నది తమ సర్వేలో వెల్లడైందన్నారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ  మొదటి నుంచి పొత్తులతో మాత్రమే గెలుస్తూ వస్తోందని…ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీలు పెట్టిన పథకాలను కాపీ కొట్టిందని…ఆ సంస్థ వెల్లడించింది.  నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో అయితే వైసీపీ ఏకంగా క్లీన్ స్వీప్ చేస్తుందంటోంది సీఎస్డీఎస్.

మరో ప్రముఖ సంస్థ…తెలంగాణా సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో స్పష్టంగా ఫలితం చెప్పిన ఆరా సంస్థ ప్రతినిధి మస్తాన్ వలీ కూడా ఈసారి వైసీపీదే అధికారమంటున్నారు. నియోజకవర్గానికి 50 మంది అభిప్రాయాలతో కచ్చితమైన ఫలితం నిర్ణయించవచ్చని అయితే తమ సంస్థ ప్రతి నియోజకవర్గంలో 1000 మంది అభిప్రాయాలు సేకరించిందన్నారు మస్తాన్ వలీ. ఎన్నికల నోటిఫికేషన్‌ అనంతరం వైసీపీకు  ప్రజాదరణ బాగా పెరిగిందని..తాము పలు రాష్ట్రాల్లో సర్వేలు చేసినా కొద్ది కాలంలోనే  గణనీయమైన మార్పు ఎక్కడా చూడలేదంటున్నారు. 2014 ఎన్నికలతో పోల్చితే ఈసారి 0.67 శాతం మాత్రమే ఓటింగ్‌ శాతం పెరిగిందని తమ సర్వేలో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీకు వచ్చిన ఓట్లలో 47 శాతం మహిళల ఓట్లే ఉన్నాయన్నారు. అదే సమయంలో టీడీపీకి వచ్చిన మొత్తం ఓట్ల శాతంలో కేవలం 43 శాతం ఓట్లే మహిళలవని చెప్పారు. టీడీపీకు గట్టి అండగా ఉండే  బీసీలు ఈసారి ఆ పార్టీకు దూరమై 65–70 శాతం మంది వైఎస్సార్‌సీపీకి దగ్గరయ్యారని.. కాపుల్లో కూడా అత్యధికులు పవన్‌కల్యాణ్‌కు రాజ్యాధికారం దక్కదనే భావనతో వైసీపీ వైపు మొగ్గు చూపారనని ఆరా తెలిపింది.

ఇక ముందు నుంచీ మూడు ధపాలుగా సర్వేలు చేసిన సీపీఎస్ సంస్థ అయితే కరాఖండీ వైసీపీదే అధికారమని బల్లగుద్ది మరీ వాదిస్తోంది. అంతేకాకుండా… టీడీపీ అధినేత చంద్రబాబు ఒక్కోసారి ఒక్కో విధంగా పొంతనలేకుండా మాట్లాడటం.. ఈవీఎంలు ట్యాంపరింగ్‌ అయ్యాయని ఓసారి…ఎన్నికల కమిషన్‌ ఏకపక్షంగా వ్యవహరించిందని మరోసారి చెబుతూనే…150 సీట్లలో విజయం సాధిస్తామనడం హాస్యాస్పదంగా ఉందంటున్నారు ఆ సంస్థ ప్రతినిధి డాక్టర్ వేణుగోపాలరావు.  వైసీపీ ఫిబ్రవరి నుంచి తమ ఆధిక్యాన్ని పెంచుకుంటూ వచ్చిందంటున్నారు ఆయన. ఫిబ్రవరి నెల మధ్యలో ఓసారి, మార్చి నెలలో మరోసారి సర్వే చేశామని అన్నారు. డ్వాక్రా మహిళల్లో 45 శాతం మంది టీడీపీకి, 46 శాతం మంది వైసీపీ వైపు మొగ్గు చూపారని ఆయనంటున్నారు. మొత్తమ్మీద మహిళలను తీసుకుంటే 8 శాతం మంది అధికంగా వైసీపీ వైపు మొగ్గు చూపారని.. పసుపు – కుంకుమ పదకం ఆ పార్టీకు ఓట్లు రాల్చలేదన్నారు.  జగన్‌ – ఫ్యాన్‌ అనే అంశం జనంలో రిథమిక్‌గా వెళ్లిందని… పొలిటికల్‌ మేనేజిమెంట్, పబ్లిక్‌ మేనేజిమెంట్‌ ఇలా ఏ అంశాన్ని ప్రాతిపదికగా తీసుకున్నావైసీపీ ముందు వరుసలో నిలిచిందంటోంది సీపీఎస్. ఎన్నికలకు పది రోజుల ముందు వరకూ టీడీపీ కంటే వైఎస్సార్‌సీపీని బలపరిచిన ఓటర్ల సంఖ్య 5 శాతానికి పెరిగిందని.. ఎన్నికల నాటికి అది 9 శాతానికి పెరిగిందనేది సీపీఎస్ చెబుతున్న మాట.

సర్వేల ప్రామాణికత ఏంటి..

ఓటమి విషయాన్ని జీర్ణించుకోలేక చాలామంది సర్వేలన్నీ తప్పని ప్రచారం చేస్తుంటారు. శాస్త్రీయ పద్ధతిలో చేసిన ఏ సర్వే అయినా ప్రామాణికంగా ఉంటుందనేది సెఫాలజీ శాస్త్రం చెబుతున్న మాట. కేవలం డబ్బు ఒక్కటే ఎన్నికల సర్వేలకు ప్రామాణికం కాదని..డబ్బు యావలో పడి వాస్తవ విరుద్ధమైన ఫలితాలు ప్రకటిస్తే  సదరు సంస్థ ప్రతిష్ట  దెబ్బ తింటుందనేది వాస్తవం.  ఒకసారి ఓ సంస్థపై ఉన్న నమ్మకం పోతే తిరిగి రాదు. అందుకే సర్వేల్లో నిబద్దత ఉండాలి. ప్రజల్లో విశ్వసనీయతన పెరిగేలా చేయాలి. కొందరు ఒపీనియన్‌ పోల్‌ను కూడా ఎగ్జిట్‌ పోల్స్‌ అంటూ వైరల్‌ చేయడం సరికాదని ప్రముఖ సెఫాలజిస్ట్ భమిడిపాటి రామ్మూర్తి చెప్పారు.  రాజకీయ పార్టీలు ఎ, బి, సి, డి పేరుతో ఇచ్చే ప్రశ్నలతో చేసే సర్వేల్లో కచ్చితమైన ఫలితాలు వచ్చే అవకాశంలేదు. సైంటిఫిక్‌గా సర్వే చేయాలి. సర్వే ఎవరు చేశారు? ఎప్పుడు చేశారు? ఎలా చేశారు? అనే వివరాలు ప్రజలకు నిష్పక్షపాతంగా అందించగలగాలి.  ఉదాహరణకు ఐ పల్స్ చేసిన సర్వేను ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. ఓ  యాప్‌ క్రియేట్‌ చేసి ఫ్రాక్సీ బ్యాలెట్‌ మెథడ్‌లో ఓటర్ల అభిప్రాయాలు సేకరించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11 వందల మంది ప్రతినిధులు 50 వేల మంది ఓటర్ల పోలింగ్‌ ను ఒక్క రోజులోనే తీసుకున్నారు. ఓటేసి వచ్చిన ఓటర్లను కలిసి ఏ పార్టీకి ఓటు వేశారో? ఆ మొబైల్‌ యాప్‌లో నొక్కమని చెప్పాం. ఓటరు ఏఁ నొక్కుతున్నాడో కూడా ఆ ప్రతినిధులు చూడకుండా ఓటరుతోనే యాప్ లో ఓటు వేయించామన్నారు. ఇలా శాస్త్రీయంగా …బ్యాలెట్ బాక్స్ పద్ధతిలో చేసే ఎగ్జిట్ పోల్స్ కు ప్రామాణికత ఉంటుందనేది ఆయన చెబుతున్న మాట.

అభ్యర్దుల ఎంపిక నుంచి  పోల్ మేనేజ్ మెంట్ వరకూ..

కేవలం ప్రచారంలో మందుకు వెళ్లడమే కాదు. అభ్యర్ధుల ఎంపిక అతి ముఖ్యమైనది. అభ్యర్ధి గుణగణాలతో పాటు.. సామాజిక సమీకరణాల్ని కూడా లెక్కలోకి తీసుకోవాలి. అనంతరం పోలింగ్ బూత్ వరకూ ఓటరును ఓటు వేయించేలా చేయడం వరకూ ఉన్న పోల్ మేనేజ్ మెంట్ మరో అద్భుతమైన కళ. ఈ రెండింటిలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పైచేయి సాధించారు. గత ఎన్నికల్లో వైసీపీ ఎక్కడ వైఫల్యం చెందిందో ఈసారి అదే పోల్ మేనేజ్ మెంట్లో జగన్ సక్సెస్ అయ్యారన ితెలుస్తోంది. అదే సందర్భంలో పోల్ మేనేజ్ మెంట్లో దిట్టగా చెప్పుకునే చంద్రబాబు అండ్ కో ఈసారి చతికిలపడటం కూడా ఓ కారణమని తెలుస్తోంది. అంతేకాదు..వైఎస్ జగన్ అభ్యర్థుల ఎంపిక బాగుందనేది సర్వత్రా విన్పించిన మాట. సో…ఓవరాల్ గా జగన్ ఒక్కడై పార్టీని గెలిపిస్తున్నాడన్నది ఇప్పుడు చర్చనీయాంశం కాబోతున్న అంశం. అందుకే జగన్ నోట శ్రీశ్రీ చెప్పిన కవిత మరోసారి మననం చేసుకుందాం.. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరితే…నిబిడాశ్చర్యంతో వీరే…నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలితే నిర్ధాక్షిణ్యంగా వీరే…

నిజమే మరి. సక్సెస్ హ్యాజ్ మెనీ ఫాదర్స్..బట్ ఫెయిల్యూర్ ఈజ్ యాన్ ఆర్ఫాన్.

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.