టీవీ 9 రవిప్రకాశ్ ది ఇప్పుడు ఓ ముగిసిన అధ్యాయం…

ఫోర్జరీ ఆరోపణలు..సంస్థ నిర్వహణలో వైఫల్యం…

నిధులు పక్కదారి మళ్లించడం, వాటాదారుల హక్కుల్ని కాలరాయడం..

రవిప్రకాశ్ కోసం పోలీసుల గాలింపు…మిస్సైన గరుడ శివాజీ ఆయుధం…

టీవీ నైన్. తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. 2003 డిసెంబర్ లో 24 గంటల వార్తా ప్రసార ఛానెల్ గా ప్రారంభమైన టీవీ 9కు బలమంతా ఆయనే.  వార్తను ఎలా మార్కెట్ చేయాలో…వార్తను ఎలా వండివార్చాలో బాగానే నేర్పారాయన. వార్తను మార్కెట్ చేయడంలో…టీవీ 9 ప్రాచుర్యం పొందడంలో అతనితో పాటు..ఇంకా తెరవెనుక చాలామంది పాత్రే ఉంది. అయితే ఆ అందరి పేర్లను…కృషినీ హైజాక్ చేయడంలో అప్పుడే అతనికి ప్రావీణ్యత ఉంది. అలా తెరవెనుక కృషితో వార్తను హైలైట్ చేయడంలో సిద్ధహస్తుల్లో మరొకరు ఇప్పుడు ఎన్టీవీలో ఉన్న రాజశేఖర్  అని చెప్పుకోవడం అతిశయోక్తి కానేకాదు.

ఏం జరిగింది…

ఇన్నాళ్లూ చక్రం తిప్పిన రవి ప్రకాశ్ కు ఇప్పుడు దశపోయింది. చేసిన తప్పులు వెలుగులోకి వచ్చాయి. యాజమాన్యం మారడంతో ఒక్కొక్కటికీ వెలుగుచూసి…అతనిపై వేటుకు కారణమైంది. ఇప్పుడు రవి ప్రకాశ్ ను ఆ సంస్థ సీఈఓ పదవి నుంచి కొత్త యాజమాన్యం తొలగించేసింది. టీవీ9 సంస్థ నిర్వహణలో వైఫల్యం, సంస్థ కీలక ఉద్యోగి కౌశిక్ రావు సంతకం ఫోర్జరీ ఆరోపణలతో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీవీ9లో  కేవలం 8శాతానికి పైగా వాటా ఉన్న రవిప్రకాష్ 90 శాతానికి పైగా వాటా ఉన్న కొత్త యాజమాన్యాన్ని ఇబ్బందిపెడుతున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. మెజారిటీ వాటాదారుల హక్కులను రవిప్రకాశ్ కాలరాస్తున్నారని కూడా కొత్త యాజమాన్యం ప్రధానంగా ఆరోపిస్తూ వచ్చింది.  కొత్త డైరెక్టర్ల నియామకానికి కూడా రవిప్రకాష్ అడ్డు తగులుతున్నారన్నది మరో ఆరోపణ. ఇదిలా ఉంటే.. రవిప్రకాష్‌పై నిధుల మళ్లింపు ఆరోపణలు రావడమే మీడియా వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈయనపై సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పీఎస్‌లో ఫోర్జరీ కేసు నమోదైంది. ఐటీ యాక్ట్ 56, ఐపీసీ 406, 467 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తన సంతకాన్ని రవిప్రకాష్ ఫోర్జరీ చేశారని అలంద మీడియా కంపెనీ కార్యదర్శి కౌశిక్ రావు ఫిర్యాదు చేయడంతో అసలు వ్యవహారమంతా బయటకు వచ్చింది. కౌశిక్ రావు  ఫిర్యాదుతో కేసు నమోదు  చేసిన పోలీసులు రవి ప్రకాశ్  కోసం రెండ్రోజులుగా గాలిస్తున్నారు. అయితే రవిప్రకాష్‌ మాత్రం ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారని కొంతమంది…విషయం తెలుసుకుని ముందే విదేశాలకు జారుకున్నారని మరి కొందరు చెబుతున్నారు. ఇందులో భాగంగానే టీవీ9 కార్యాలయంలోనూ,  అతని నివాసంలోనూ సైబర్ క్రైం పోలీసులు సోదాలు నిర్వహించారు.

కొత్త యాజమాన్యంలో టీవీ 9…

రవి ప్రకాశ్ చేసిన నేరమేంటి…

కొద్ది రోజుల కిందట ఏబీసీఎల్ కార్పొరేషన్ నుంచి టీవీ9ను అలంద మీడియా కొనుగోలు చేసింది. సీఈఓ గా ఉన్న రవిప్రకాశ్ భారీ ఎత్తున కంపెనీ నిధులను దారి మళ్ళించాడని  కొత్త యాజమాన్యం  గుర్తించింది. అంతేకాకుండా పదవి నుంచి  వైదొలగాలని కొన్నిరోజులుగా ఆదేశాలు జారీ చేస్తున్నా రవి ప్రకాశ్ పట్టించుకోలేదు. మరోవైపు కంపెనీ ఆర్ధిక లావాదేవీలపై అంతర్గత విచారణ జరిపిన కొత్త యాజమాన్యం… భారత్ వర్ష్ ఛానల్స్ వ్యవహారంలో రవిప్రకాష్‌ కోట్లాది రూపాయలు దారి మళ్ళించినట్లుగా నిర్ధారణకు వచ్చింది. ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. కొత్త యాజమాన్యమైన అలంద మీడియా ఓ సుదీర్ఘ ప్రకటనను కూడా జారీ చేసింది. అందులోని ముఖ్యాంశాలేంటంటే….

సంస్థలో 90 శాతానికి పైగా వాటా ఉన్న కొత్త యాజమాన్యానికి ఆ కంపెనీ నిర్వహణలో అడుగడుగునా అడ్డుపడుతూ, కంపెనీల చట్టంలోని నిబంధనలకు వ్యతిరేకంగా  రవి ప్రకాశ్ వ్యవహరిస్తున్నారని కొత్త యాజమాన్యం ఆరోపించింది. మెజార్టీ వాటాదారుల హక్కులను అణగదొక్కుతూ… కుట్రపూరిత చర్యలకు పాల్పడ్డారని ఆరోపించింది అలందా మీడియా. సంస్థ నిర్వహణకు సంబంధించి రవిప్రకాశ్ పాల్పడిన అక్రమాలపై  యాజమాన్యం అతనిపై చీటింగ్ కేసు కూడా పెట్టింది. ఈ కేసు ప్రకారం సంస్థకు హాని కలిగించే ఉద్దేశంతో కొందరు వ్యక్తులతో కుమ్మక్కై ఫోర్జరీ పత్రాలు సృష్టించడమే కాకుండా  సంస్థ నిర్వహణలో యాజమాన్యానికి తరచూ ఇబ్బందులు కలిగిస్తున్నారని ఫిర్యాదు సారాంశం. వివరాల్లోకి వెళితే..  టీవీ9 పేరుతో తెలుగు, మరాఠీ, కన్నడ, గుజరాతీ, ఇంగ్లీషు, హిందీ ఛానళ్లను అసోసియేటెడ్‌ బ్రాడ్‌ కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ABCL)ను  ప్రముఖ వ్యాపారవేత్త శ్రీనిరాజుకు చెందిన చింతలపాటి హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ , ఐల్యాబ్స్ వెంచర్ కేపిటల్ ఫండ్ కలిపి ప్రారంభించాయి.

ABCL సంస్థలో ఈ రెండు కంపెనీలకు కలిపి 90 శాతానికి పైగా వాటా ఉంది. అదే సమయంలో ఓ ఉద్యోగిగా చేరి సీఈవో, డైరెక్టర్‌గా హోదా పొందిన రవిప్రకాశ్, ఆయన అసోసియేట్స్‌కు దాదాపు 8 శాతం వాటా ఉంది.  ఏబీసీఎల్ లో 90 శాతానికి పైగా వాటా ఉన్న రెండు సంస్థల నుంచి ఆ వాటాను కొనుగోలు చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన అలందా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్ లిమిటెడ్ గత ఏడాది ఆగస్టు 23న ఓ ఒప్పందం కుదుర్చుకుంది. అదే ఏడాది ఆగస్టు 25న  డబ్బు కూడా చెల్లించింది.  దీనికి అనుగుణంగానే ఆ షేర్లన్నీ అలందా మీడియా పేరుపై ఆగస్టు 27వ తేదీన డీ మ్యాట్ ద్వారా బదిలీ  అయ్యాయి. ఈ లావాదేవీని గుర్తిస్తూ ఏబీసీెఎల్  కంపెనీ తన రికార్డుల్లో నమోదు చేసుకుని.. సంబంధిత పత్రాలను రిజిస్ట్రార్ ఆఫ్‌ కంపెనీస్‌ కార్యాలయంలో దాఖలు కూడా చేసింది. యాజమాన్యం చేతులు మారడంతో అలందా మీడియా సంస్థ తరపున నలుగురు డైరెక్టర్లను నియమించేందుకు కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అనుమతి కోసం ఏబీసీఎల్ సంస్థలో రెండుసార్లు బోర్డు సమావేశంలో తీర్మానాన్ని కూడా ఆమోదింపజేసుకుంది.  అదే తీర్మానాన్ని సంబంధిత మంత్రిత్వ శాఖకు కూడా పంపింది. ఈ తీర్మానాలపై ఒకసారి వి.రవిప్రకాశ్, మరోసారి ఎం.కె.వీ.ఎన్ మూర్తి అనే మరో డైరెక్టర్ ఏబీసీఎల్  డైరెక్టర్ల హోదాలో సంతకాలు చేశారు. ఈ నేపధ్యంలో కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ మార్చి 29, 2019న అనుమతిని కూడా మంజూరు చేసింది.  ఇలా అన్ని అనుమతులు ఉన్నా సరే… కొత్త డైరెక్టర్లతో బోర్డు మీటింగ్ నిర్వహించేందుకు రవిప్రకాశ్  కొత్త యాజమాన్యానికి అన్ని విధాలుగా అడ్డుపడుతూ వచ్చారన్నది ప్రదాన ఆరోపణ.  కొత్తగా నియమించబడిన నలుగురు డైరెక్టర్లు తమ నియామకానికి చెందిన కాగితాలను రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయంలో దాఖలు చేయాల్సిందిగా కంపెనీ సెక్రటరీని కోరారు. ఈ ప్రయత్నాన్ని అడ్డుకోడానికి రవి ప్రకాశ్, అయన సహచరులు కంపెనీ సెక్రటరీ రాజీనామా చేసినట్టు పాతతేదీతో ఫోర్జరీ డాక్యుమెంట్ ను క్రియేట్ చేశారు. దీనిపైనే ఇప్పుడు కేసు నడుస్తోంది ప్రధానంగా. రవిప్రకాశ్ ఫోర్జరీ వ్యవహరాన్ని సీరియస్ గా తీసుకున్న కొత్త యాజమాన్యం అతన్ని పదవి నుంచి తొలగించేసింది. 90 శాతానికి పైగా వాటా ఉండడంతో కంపెనీ నిర్వహణకు సంబంధించి…కీలక నిర్ణయాలు తీసుకునే హక్కు చట్టప్రకారం కొత్త యాజమాన్యానిదే. సంస్థకు హాని కలిగించడానికి సినీ నటుడు శివాజీతో దురుద్దేశ పూర్వకంగా కుమ్మక్కై నకిలీ పత్రాలు సృష్టించడం..సంస్థ యాజమాన్యానికి నిర్వాహణలో ఇబ్బందులు కల్పించడం చేస్తున్నారని రవి ప్రకాశ్ పై కొత్త యాజమాన్యం ఫిర్యాదు చేసింది.

శి్వాజీని రంగంలో దింపినా ప్రయోజనం కలుగలేదే…

ఏబీసీఎల్  లో 90 శాతం వాటాను కొత్త యాజమాన్యం కొనుగోలు చేయడం ఇష్టం లేక..ఇబ్బందుల్ని సృష్టించాలని చూశారని రవి ప్రకాశ్ పై ఉన్న ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణకు తగ్గట్టుగానే గరుణ పురాణ కర్త నటుడు శివాజీ..ఇటీవల నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేశాడు. సీఈఓ రవి ప్రకాశ్ తనను మోసం చేశాడన్నది ఈ ఫిర్యాదు సారాంశం. శివాజీ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం రవి ప్రకాశ్ కు ఏబీసీఎల్ సంస్థలో 8 శాతం వాటా ఉంది. ఇందులోంచి 40 వేల షేర్లను కొనుగోలు చేయడానికి రవి ప్రకాశ్ కు 20 లక్షల రూపాయల డబ్బు చెల్లించి..గత ఏడాది ఫిబ్రవరి 20 న ఒప్పందం కుదుర్చుకున్నానని శివాజీ చెప్పుకొచ్చారు. ఒప్పందం జరిగిన ఏడాదిలోగా షేర్లను తన పేరుపై బదిలీ చేస్తానని రవి ప్రకాశ్ చెప్పడంతో..అతనిపై నమ్మకంతో అంగీకరించాననని శివాజీ ఫిర్యాదులో తెలిపారు. అయితే రవి ప్రకాశ్ ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మోసం చేశాడని శివాజీ ఫిర్యాదు సారాశం ఉంది. ఏబీసీఎల్ లో జరుగుతున్న మార్పులకు సంబంధించిన నిజాల్ని రవి ప్రకాశ్ తనకు చెప్పకుండా దాచాడని..మోసపూరితంగా వ్యవహరించాడని కూడా శివాజీ ఫిర్యాదు చేశాడు నేషనల్ ట్రిబ్యునల్ కు.  ఈ విషయంపై రవిప్రకాశ్ వ్యవహారంతో విసిగిన తాను అతనికి నోటీసు కూడా అందించానన్నారు శివాజీ. ఈ నోటీసుకు స్పందించిన రవి ప్రకాశ్…షేర్ల బదిలీలో జదాప్యానికి లా ట్రిబ్యునల్ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులే కారణమని…వివాదం పరిష్కారమైన వెంటనే షేర్లు బదిలీ చేస్తానంటూ ఫిబ్రవరి 17న సమాధానమిచ్చాడట.

వాస్తవమేంటి…ఇదంతా ఓ నాటకమా…

అయితే ఇదంతా ఓ డ్రామాగా అలంద మీడియా ఆరోపించింది. తన చేతి నుంచి టీవీ9 పగ్గాలు పోకుండా ఉండేందుకే రవి ప్రకాశ్, నటుడు శివాజీతో కలిసి ఆడుతున్న నాటకమని అలంద మీడియా చెబుతోంది. ఈ ఆరోపణలకు తగిన ఆధారాల్ని కూడా ఆ సంస్థ చూపిస్తోంది. రవి ప్రకాశ్, శివాజీల మధ్య 2018, ఫిబ్రవరిలో జరిగినట్టు చెబుతున్నషేర్ కొనుగోలు ఒప్పందం కేవలం తెల్ల కాగితాలపై ఉంది. వాటా కొనుగోలు చేసినప్పుడు తక్షణం బదిలీ జరపకుండా..ఏడాది వ్యవధి ఇవ్వడం మరో అనుమానమని ఆ సంస్థ అంటోంది. అందుకే కొత్త యాజమాన్యమైన తనకు ఇబ్బంది కల్గించాలని ప్రయత్నిస్తున్నారంటూ ఆ ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశామంటోంది అలంద మీడియా. ఈ వ్యవహారాన్ని ఓ వివాదంగా సృష్టించి…శివాజీతో న్యాయపరమైన ఇబ్బందుల్ని కలిగించడం ద్వారా టీవీ9 పగ్గాలు తన చేతి నుంచి పోకుండా కాపాడుకోవాలన్నది రవిప్రకాశ్ దురుద్దేశంగా అలంద మీడియా ఆరోపించింది. నిజంగా రవి ప్రకాశ్ మోసం చేసి ఉంటే…అతని వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్ లేదా కోర్టుకు వెళ్లకుండా నేరుగా నేషనల్ లా ట్రిబ్యునల్ కు వెళ్లడంతో ఉన్న మతలబే సందేహాలకు కారణమయ్యాయని కూడా కొత్త యాజమాన్యం స్పష్టం చేసింది.

మొత్తానికి నటుడు అలియాస్ గరుడ పురాణ కర్త శివాజీని అడ్డు పెట్టుకుని టీవీ9 మాజీ సీఈఓ రవి ప్రకాశ్ సాగించిన డ్రామాలు, ఫోర్జరీ వ్యవహారాలు బెడిసి కొట్టాయి. నిన్నటి వరకూ టీవీ9 అంటే తానే అని ఓ వెలుగు వెలగడడమే కాకుండా…ఎల్లో మీడియాకు రాజులా వ్యవహరించిన రవి ప్రకాశ్ వ్యవహారం ఇప్పుడు ఓ ముగిసిన అధ్యాయం….

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.