సీఎం వర్సెస్ సీఎస్ లో పైచేయి సాధించిన సీఎస్…

సీఎస్ కోరిన విధంగా ఎజెండాను పంపిన సీఎంఓ..

కేబినెట్ 14వ తేదీకు వాయిదా…

బిల్లుల చెల్లింపు కోసమే ఈ రచ్చంతా…

ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన కార్యదర్శికు..ముఖ్యమంత్రికి మధ్య నెలకొన్న ప్రఛ్ఛన్నయుద్ధంలో సీఎస్ నే పైచేయి సాధించారు. మే 10 వ తేదీన కేబినెట్ సమావేశం ఏర్పాటుకు నిర్ణయించిన సీఎం..అనంతరం 14 వ తేదీకు  వాయిదా వేశారు. ఈసీ అనుమతి నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల ముగిసిన అనంతరం కోడ్ అమల్లో ఉన్నా సరే…యధేఛ్ఛగా నిబంధనల్ని తుంగలో తొక్కుతున్న చంద్రబాబు మరోసారి అదేపనికి ప్రయత్నించారు. ఈ నెల 10 వతేదీన కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించడంతో పాటు…సీఎంవో నుంచి సీఎస్ కు ఓ నోట్ పంపారు.

అయితే కోడ్ అమల్లో ఉన్నందున సీఎస్ ఈ విషయంపై స్పందించారు. ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్న తర్వాతే కేబినెట్‌ భేటీ నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ప్రిన్సిపల్‌ సెక్రటరీ నుంచి కేబినెట్‌ భేటీకి సంబంధించిన నోట్‌ తనకు వచ్చిందని అయితే అందులో ఎజెండా అంశాలు లేవని చెప్పారు. ఏయే అంశాలపై కేబినెట్ లో నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారో తెలియజేయాలంటూ సీఎంను కోరినట్టు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ విషయమై…ఈసీ నిబంధనలను సీఎంకు వివరించాల్సిందిగా ఆయన సెక్రటరీకి కూడా సూచించినట్టు వెల్లడించారు. కేబినెట్‌ అజెండాను పరిశీలించి.. ఎన్నికల సంఘానికి పంపుతామని, ఆ అజెండాను ఈసీ ఆమోదించాకే కేబినెట్‌ భేటీ నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. పంపిన అజెండాను పరిశీలించి అభిప్రాయాన్ని వెల్లడించేందుకు ఈసీ కనీసం 48 గంటల సమయం తీసుకుంటుందని కూడా చెప్పారు.

దాంతో చేసేది లేక సీఎం తన కేబినెట్ సమావేశాన్ని ఈనెల 14వ తేదీకు వాయిదా వేశారు. అంతేకాకుండా సమావేశంలో చర్చించే అజెండా అంశాల్ని మరోసారి సీఎంవో  కార్యాలయం సీఎస్ కు పంపింది.  ఫొని తుపాన్‌, కరువు, జాతీయ ఉపాధి హామీ పథకం కూలీలకు నిధుల విడుదలపై తలెత్తిన అడ్డంకులపై చర్చ మొదలగు అంశాలను అజెండాలో చేర్చారు. నిబంధనల ప్రకారం సీఎంవో నోట్ ఉండటంతో…సీఎస్  దాన్ని పరిశీలించి ఈసీకు పంపనున్నారు. ఈసీ నుంచి అనుమతి వచ్చిన తరువాతే కేబినెట్‌ భేటీ నిర్వహిస్తా మన్నారు సీఎస్. మొత్తానికి కోడ్ అమల్లో ఉన్న నేపధ్యంలో ఇరువురి మధ్య నెలకొన్న ప్రఛ్చన్న యుద్ధంలో సీఎస్ పై చేయి సాధించినట్టే.

ఈసీ అనుమతి లభించేనా…

ఇంత రచ్చచేసి మరీ సీఎం కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు ేచయాలనుకోవడం వెనుక కారణమేంటి..ఎందుకింత పట్టుబడు తున్నారు..సీఎస్ తో ఘర్షణ ఎందుకు.. ఈ కారణాల్ని పరిశీలిస్తే ఒకటే అర్ధమవుతుంది. కావల్సినవారికి బిల్లులు చెల్లించుకోడానికి ఇదొక ఎత్తుగడగా తెలుస్తోంది. అసలీ ఎజెండాకు ఈసీ అనుమతి ఇస్తుందా అనేది కూడా అనుమానమే. ఒకవేళ అనుమతి వస్తే..ఇదే ఈ ప్రభుత్వానికి చివరి కేబినెట్ సమావేశం కానుంది. సీఎంవో కార్యాలయం ఎజెండాలో పేర్కొన్న అంశాల్ని ఈసీ అత్యవసరంగా భావిస్తేనే కేబినెట్ ఏర్పాటుకు ఈసీ అనుమతి ఇస్తుంది. వాస్తవానికి ఎజెండాలో చెప్పన అంశాల్లో ఎక్కడా అత్యవసర పరిస్థితి లేదు. కేవలం అధికారులు తన చుట్టూ తిరగడం లేదనే అభద్రతతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నిక ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీలపై విమర్శలు దిగుతున్నారని  సీనియర్ ఐఏఎస్ లే అభిప్రాయపడు తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా కేబినెట్ నిర్వహించాల్సిన అసాధారణ, అత్యవసర పరిస్థితులు రాష్ట్రంలో లేవు. ఎజెండాలో పేర్కోన్నఅంశాల్లోని కరువు, తుపానులకు సంబంధించి పరిహారం అందించేందుకు ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలున్నాయి. ఈ పరిస్థితుల్ని తెలుసుకుని కూడా కేబినెట్ నిర్వహిస్తున్నారంటే ఇదే ఆఖరి కేబినెట్ కానుందని బాబుకు అర్ధమై ఉంటుందనేది ఓ వాదన. ఎజెండా అంశాల్ని ప్రాదిపదికగా తీసుకుంటే ఈసీ అనుమతి లభించదనేది పలువురు ఐఏఎస్ అధికారుల  అభిప్రాయంగా ఉంది. మాట్లాడితే చాలు 40 ఏళ్ల అనుభవముందనడం, దేశంలో తానంత సీనియర్ ముఖ్యమంత్రి మరెవరూ లేదంటూ చెప్పుకొస్తున్న బాబుకు కనీసం నియమాల గురించి, కోడ్ వ్యవహారం గురించి తెలియదా అని ప్రశ్నిస్తున్నా రంతా. రాజ్యాంగ వ్యవస్థను నీరుగారుస్తూ..వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయందుకే. ఎజెండాలోని అంశాల గురించి ఓసారి పరిశీలిస్తే…ఆయా పనుల పరిశీలనకు గానీ. అనుమతికి గానీ కేబినెట్ సమావేశం అవసరం లేదనే అభిప్రాయానికి ఈసీ వస్తుందనేది సీనియర్ అధికార్లు మాట. ఆ అంశాలపై చర్యల్ని నేరుగా సీఎస్ నే తీసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ  పరిస్థితుల్లో అనవసర రాద్ధాంతానికి పోయి చంద్రబాబు మరోసారి అవమానం కొని తెచ్చుకుంటున్నారనేది అధికంగా విన్పిస్తున్న మాట. సుహృద్భావ వాతావరణంలో పని చేయించుకోవల్సింది పోయి…వివాదాన్ని మరింతగా పెంచుతున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ తరహా వైఖరితో ముఖ్యమంత్రి చంద్రబాబు తన హుందాతనాన్ని కోల్పోయారని విశ్లేషకులు చెబుతున్నారు.

కోడ్ చెబుతున్నదేంటి..

ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పుడు ఆయా ప్రభుత్వాలు గానీ, రాష్ట్రాలు గానీ కేంద్ర ఎన్నికల కమీషన్ పర్యవేక్షణలో వెళ్తాయి. కేబినెట్ లోని అజెండా అంశాలపై అధ్యయన చేయాల్సి ఉంటుంది ముందుగా దీనికోసం సీఎస్ గా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యాన పరిశీలన కమిటీ సమావేశం అవుతుంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీతో పాటు వివిధ శాఖల ముఖ్య కార్యదర్శు లు పాల్గొంటారు ఈ సమావేశంలో. సీఎంవో కార్యాలయం ఎజెండాలో పేర్కొన్న అంశాలు కోడ్ కు లోబడి ఉన్నాయా లేదా అనేది పరిశీలిస్తుంది ఈ కమిటీ. అదేవిధంగా బిజినెస్ నియమాల ప్రకారం ఈ అంశాలకు కేబినెట్ అవసరం ఉందా లేదా అనేది కూడా పరిశీలిస్తుంది. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలు, శాంతిభద్రతల సమస్లు తలెత్తి రాష్ట్రంలో అసాధారణ, అత్యవసర పరిస్థితులు ఏర్పడి నప్పుడే ముఖ్యమంత్రి సంబంధిత అధికార్లతో, సీఎస్ తో చర్చింది తగిన ఆదేశాలు జారీచేయాలని ఎన్నికల నియమావళి స్పష్టం చేస్తోంది. అందుకే  ీ అజెండాను కమిటీ పరిశీలించిన అనంతరం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీతో కేంద్ర ఎన్నికల
కమీషన్ కు నివేదికను పంపనున్నారు. ఈ నివేదిక ఆధారంగానే కేంద్ర ఎన్నికల కమీషన్ నిర్ణయం తీసుకోనుంది. పరిశీలన కమీటి పంపే అజెండా నోట్ పై సందేహాలు తలెత్తితే ఈసీకు వివరణ పంపాల్సి ఉంటుంది కూడా. ఈ నేపధ్యంలోనే అజెండాలో పేర్కొన్న నాలుగు అంశాలపై నోట్ పంపాలని ఇప్పటికే సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆయా శాఖల ముఖ్యకార్యదర్శులకు ఆదేశించారు. ముఖ్యంగా ఫోని తుపాను సహాయకచర్యలపై పూర్తి వివరాలతో నోట్ ను పంపాలని రెవిన్యూ డిజాస్టర్ మేనేజ్ మెంట్, ఆర్టీజీఎస్ లను సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. తాగునీటిపై నోట్ ను సిద్ధం చేయాలంటూ పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖల్ని ఆదేశించారు. ఇక రాష్ట్రంలోని వాతవరణ పరిస్థితులు, కరువు, ఉపాధి హామీకి సంబంధించిన అజెండా నోట్ ను పంపాలని కూడా ఆయా శాఖలకు ఆదేశాలు జారీ అయ్యాయి. కోడ్ ఇంత స్పష్టంగా ఉన్నాసరే…ముఖ్యమంత్రి చంద్రబాబు కేవలం ప్రచార యావతో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.

భయపెట్టి పనులు చేయించుకోవాలా…

ఎన్నికల్లో ఓటమి తప్పదనే అభిప్రాయంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు ఇప్పటికే వస్తున్నాయి. కేబినెట్ సమావేశం ఏర్పాటుతో అధికారుల్ని భయపెట్టి పనులు చేయించుకోవాలన్నదే బాబు ఆలోచనగా ఉందని తెలుస్తోంది. కోడ్ అమల్లో ఉండటంతో సీఎస్ తో సహా ఏ అధికారిని కూడా ముఖ్యమంత్రి సమావేశాలకు ఆహ్వానించకూడదు. ఒకవేళ ఆహ్వానించినా సరే…సదరు అధికారులు ఆ సమావేశాల్లో పాల్గొనకూడదు.  అందుకే కేబినెట్ వంకతో అధికార్లను పిలిపించుకుని కావల్సిన పనులు చేయించుకోవాలనేది ఆసలు ఉద్దేశ్యంగా ఉంది. ఓటమి భయంతో పూర్తిగా ఫ్రస్టేషన్ లో లోనైన బాబు ఏం చేయాలో తోచకే ఇలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు రోజురోజుకూ అధికమౌతున్నాయి. కేబినెట్ సమావేశం వంకతో అధికారుల్ని రప్పించుకుని…ఇతరత్రా నిర్ణయాలపై ఆమోదం తెలుపు కోవాలని..దాంతో పాటు కావల్సినవారికి చెందిన బిల్లుల్ని చెల్లించాలంటూ అధికారుల్ని ఆదేశించాలని బాబు ముఖ్య ఉద్దేశ్యంగా తెలుస్తోంది. చంద్రబాబు వైఖరి ఎంతసేపూ భయపట్టి పనులు చేయించుకునే విధంగానే ఉందంటున్నారు అంతా. తాను పిలిస్తే అధికారులు ఎందుకు రారో చూస్తాననే ధోరణిలో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహిస్తున్నారు తప్ప మరొకటి కాదనే వాదన కూడా విన్పిస్తోంది.

కావల్సిన ఆ బిల్లుల సంగతి ఇదీ…

ఒకటి కాదు రెండు కాదు..ఏకంగా 1920కోట్ల రూపాయల ఉపాధి హామీ బిల్లుల కోసమే ఈ కేబినెట్ సమావేశం ఏర్పాటుకు కారణమని తెలుస్తోంది. ఫలితాల లోపే అంతా చక్కుబెట్టుకునేందుకు ఈ భేటీ వంక పెట్టారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో కూడా నామినేషన్ పద్ధతిలో అధికార పార్టీ నేతలు ఉపాధి హామీ పధకం కింద 1920  కోట్ల పనులు చేసినట్టు రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. ఫలితాల అనంతరం ఈ బిల్లుల చెల్లింపులో ఎటువంట ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కేబినెట్ భేటీను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.   స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఉపాధి హమీ డబ్బుల్ని తెలుగు తమ్ముళ్లకు వెదజల్లి…తద్వారా కేడర్ లో స్ధైర్యం నింపేందుకు, ఎన్నికల్లో నిలబడేందుకు వ్యూహం పన్నుతున్నారని తెలుస్తోంది.  ఉపాధి హామీ పెండింగ్ బిల్లులుగా ప్రభుత్వం చెబుతున్న 1920 కోట్లలో 14 వందల కోట్లు కేవలం మంత్రి లోకేష్ శఆఖకు చెందిందే కావడం గమనార్హం. పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా గ్రామీణ రహదారులు, ఇతర పనులకు చెల్లించాల్సినవిగా అధికారులు చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు ఈ బిల్లుల్ని చెల్లించుకోలేక పోతే..స్థానిక ఎన్నికల అనంతరం పరిస్థితిని బట్టి ఆ బిల్లులు ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే ఈ పధకం కింద చేపట్టే పనులకు ఆ గ్రామ పంచాయితీకే నిధులు చెల్లించాల్సి ఉంటుంది. ఎన్నికల అనంతరం పంచాయితీలు అధికారపార్టీ నుంచి చేజారితే…ఈ బిల్లులకు దెబ్బ పడే అవకాశాలు లేకపోలేదు. ఫిబ్రవరి నెలలో 470 కోట్లు, మార్చ్ లో 244 కోట్లు, ఏప్రిల్ లో 232 కోట్లు, మేలో 72 కోట్లు ఖర్చు పెట్టినట్టు రికార్డుల్లో నమోదైంది.

అందుకే ఈ కేబినెట్ భేటీపై బాబుకు అంత ఆసక్తిగా ఉంది. కేబినెట్ అజెండా అంశాలపై నేడు ( గురువారం) పరిశీలన కమీటీ భేటీ కానుంది. ఆయా శాఖలు మధ్యాహ్నం 3 గంటల్లోగా ఈ నోట్ లు పంపాల్సి ఉంది. ఈ నోట్ లలోని వివరాలపై చర్చించిన అనంతరం కమిటీ ఓ నిర్ణయం తీసుకుని..ఆ నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనుంది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి లబిస్తేనే..బాబుకు గౌరవం దక్కుతుంది..లేదా మరోసారి పరాభవం తప్పదన్నమాటే.

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.