పోలవరం కొట్టుకుపోతుందా…ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు

పోలవరంపై గుట్టు విప్పేసిన ఉండవల్లి…

తస్మాత్ జాగ్రత్త..లేదా తీవ్ర పరిణామాలే…

బాబుకు ఇరిటేషన్..ప్రధానికి నోటిజారుడు

రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, కాంట్రాక్టుల నిర్లక్ష్యం..టీడీపీ నేతల కమీషన్ల పర్వం..అన్నీ  ఆ ప్రాజెక్టుకు గ్రహణాలుగా మారాయి. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నాణ్యతను ప్రశ్నార్ధకంగా మార్చేశాయి. ఇదే విషయంపై నిపుణులు చాలా సందర్భాల్లో గగ్గోలు పెడుతున్నా..ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ సైతం ఆ ప్రాజెక్టు గుట్టు విప్పేశారు. మంగళవారం ఆయన విజయవాడలో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ అంశాలు, రాష్ట్ర పరిస్థితులతో పాటు పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడారు. ముఖ్యమంత్రి వ్యవహారశైలి, ప్రధాని నోరు జారడం వంటి కీలకాంశాలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

ప్రమాదంలో పోలవరం…రాజమండ్రి కొట్టుకుపోయే ప్రమాదం

ఏపీలో ప్రమాదకరమైన పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు కడుతున్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. పోలవరం వద్ద భూమి కుంగిపోతుందని, ఇది మాములు విషయం కాదని, సరిగ్గా కట్టకపోతే రాజమండ్రి మునిగిపోతుందని హెచ్చరించారు. నిపుణులను పంపి పరిశీలన చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇంకా ఆయన ఏమన్నారంటే. పోలవరం పూర్తైతే 80% భూమికి నీరు అందుతుంది. అదే పోలవరం విషయంలో మీరు వెళ్తున్న దారి సరికాదని ముందు నుంచే చెబుతూ వచ్చాను. రాష్ట్రంలో కొన్ని కోట్లు ఖర్చు చేసి ప్రజలను తీసుకెళ్లారు. నేను స్వయంగా వస్తా అంటే ఎవరూ స్పందించలేదు. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. పోలవరం విషయంలో నా అనుమానాలు నివృత్తి చేస్తే అక్కడే క్షమాపణ చెప్పి వస్తా.  ఇరిగేషన్ మంత్రి జూన్‌లో నీళ్లు ఇస్తామని గతంలో ప్రకటించారు. నిన్న చంద్రబాబు మాట్లాడుతూ వచ్చే ఏడాదికి నీళ్లు ఇస్తామని ప్రకటించారు. మీరు వచ్చే ఏడాది తర్వాత అయినా నీళ్లు ఎలా ఇస్తారో చెప్పండి. లెప్ట్ కెనాల్ పనులు అయ్యాయి, రైట్ కెనాల్ పనులు పూర్తి కాలేదు. పోలవరం నిర్మాణ ప్రాంతంలో భూమి పగుళ్లు ఏర్పడుతున్నాయి. అక్కడి భూమి కృంగిపోతోంది. చాలా ప్రమాదకర పరిస్థితిలో ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. భవిష్యత్తులో తేడా వచ్చి డ్యాంకు  డ్యామేజ్ అయితే రాజమండ్రి  నగరమే కొట్డుకుపోతుంది. చుట్టుపక్కల ఉన్న గ్రామాలు తుడుచు పెట్టుకు పోతాయి. ఎన్నికలు అయిపోయాయి, ఎన్ని వేషాలు వేసిన ప్రయోజనం ఉండదు. మళ్లీ ఎన్నికలు రావాలంటే ఐదేళ్లు పడుతుంది. ఇప్పటికైనా నిజం చెప్పండి. పోలవరం విషయం చంద్రబాబు ద్వంద్వ వైఖరి పాటిస్తున్నారు. పోలవరం విషయంలో చాలా దారుణాలు జరుగుతున్నాయని అక్కడి అధికారులే చెబుతున్నారు. కాపర్ డ్యాం వల్ల ఎంత మునిగిపోతుంది? ఆ ప్రాంత ముంపు ప్రజలకు న్యాయం చేసారా? ముంపు ప్రజలకు 30 వేల కోట్లు కావాలి ఎక్కడి నుంచి తెస్తారు? వీటన్నింటికి చంద్రబాబు సమాధానం చెప్పాలంటూ ఉండవల్లి పోలవరంపై చాలాసేపు మాట్లాడారు.

పోలవరంలో ఏం జరుగుతోందసలు…ఉండవల్లి ఆరోపణలకు కారణాలేంటి…

పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ ప్రాంతంలో ఇప్పటికే రెండుసార్లు భూమి బీటలు వారిపోయింది. కొన్ని చోట్ల లోపలకు కృంగిపోయింది. తాజాగా మరోసారి పదిహేను రోజుల క్రితం 902 హిల్‌ వ్యూ ప్రాంతంలో త్రివేణి ఏజెన్సీకి చెందిన మెకానికల్‌ షెడ్‌ ప్రాంతంలో ఒక్కసారిగా భూమి బీటలువారి పెద్ద పెద్ద పగుళ్లు ఏర్పడటంతో ప్రజలు ఆందోళన చెందారు. మెకానికల్‌ షెడ్‌లోనూ భారీగా పగుళ్లు తీయడంతో యంత్రాలు, వాహనాలు, సామగ్రిని హుటాహుటిన సురక్షిత ప్రదేశానికి తరలించారు. రెండవ విడత ఖాళీ చేయాల్సిన 19 గ్రామాల నిర్వాసితులు రాకపోకలు సాగించేందుకు.. ప్రాజెక్ట్‌ మార్గానికి వెళ్లేందుకు ఉన్న రోడ్డు మార్గం సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందంటే అతిశయోక్తి కాదు. భూకంపం మాదిరిగా ఇక్కడ భూమి బీటలు వారి పగుళ్లు తీసి కుంగిపోవడం ఆరు నెలల్లో ఇది మూడోసారి. ఈ ఘటనతో పోలవరం ప్రాంత వాసుల్లో భయం మరింత పెరిగింది. 2018 నవంబర్‌ 4వ తేదీన ఏజెన్సీ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి 100 మీటర్ల పొడవునా, 6 మీటర్ల ఎత్తున పెద్ద పెద్ద నెర్రెలు ఏర్పడి భూమి పైకి ఉబికిపోయింది. దాంతో ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు అప్పట్లో పూర్తిగా నిలిచిపోయాయి. అటు ప్రాజెక్ట్‌కి వెళ్లేందుకు అంతరాయం కూడా ఏర్పడింది. 2019 ఫిబ్రవరి 24న రెండోసారి  స్పిల్‌వే రెస్టారెంట్‌ ఎదురుగా ప్రాజెక్ట్‌ ప్రాంతానికి వెళ్లే రోడ్డు మార్గం పైకి ఉబికి బీటలు వారడమే కాకుండా పగుళ్లు ఏర్పడ్డాయి. రెస్టారెంట్‌ చుట్టూ ఉన్న సిమెంట్‌ కట్టడాలు పగిలి పోయాయి. రెస్టారెంట్‌ లోపల గచ్చు విడిపోయింది. అప్పట్లో ప్రాజెక్ట్‌ అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకుని రోడ్డు మార్గాన్ని సరిచేశారు. తిరిగి పదిహేను రోజుల క్రితం మూడోసారి పగుళ్లు ఏర్పడ్డాయి. ఏకంగా 20 మీటర్ల పొడవున భూమి బీటలు వారింది. ఇంత జరుగుతున్నా కారణమేంటన్నది మాత్రం అంతుబట్టడం లేదు. దాంతో ఇక్కడి ప్రజలు భయాందోళనలకు గురవు తున్నారు. ప్రాజెక్ట్‌ నిర్మాణ ప్రాంతాల్లో కొండల్ని తవ్వగా వచ్చిన రాళ్లను, మట్టిని యార్డు ప్రాంతంలో పరిమితికి మించి డంపింగ్‌ చేయడం వల్ల…భూమిపై ఒత్తిడి పెరిగి బీటలు వారుతోందా లేక మరేమైనా కారణముందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ప్రాజెక్టు నిర్మాణం దగ్గర నుంచీ..ప్రతి పనీ నాణ్యతకు తిలోదకాలిచ్చే విధంగా…నిబంధనలకు వ్యతిరేకంగానే జరుగుతోంది.  మెకానిక్‌ షెడ్‌కు ఓ పక్కన హిల్‌ వ్యూ కొండను బ్లాస్టింగ్‌ చేసి రాయిని డంప్‌ చేస్తున్నారు. మరో వైపు స్పిల్‌ ఛానల్‌లో మట్టి తవ్వకం పనులు సాగుతున్నాయి. స్పిల్‌ ఛానల్‌ తవ్వకం వల్ల ఈ ప్రాంతంలో బీటలు ఏర్పడ్డాయా లేక బ్లాస్టింగ్‌ల వల్లా అనేది కాంట్రాక్టు సంస్థ ఇంజనీర్లకే తెలియని పరిస్థితి.

పోలవరంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ కు ఫిర్యాదులు..

పోలవరం ప్రాజెక్టుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు కూడా ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో నిబంధనలకు వ్యతిరేకంగా పర్యావరణానికి హాని కలిగిస్తున్నారంటూ సుప్రీంకోర్టులో పిటీషన్లు కూడా దాఖలయ్యాయి. ఈ నేపధ్యంలో సుప్రీం కోర్టు జాతీయ హరిత ట్రిబ్యునల్ ను పరిశీలించాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసి ఉంది ఇప్పటికే. ఈ ఉత్తర్వుల ఆధారంగా నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌(ఎన్ జీ టీ ) కమిటీ సభ్యులు పోలవరం ప్రాజెక్టు మట్టి డంపింగ్‌ ప్రదేశాలను ఇప్పటికే పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, అధికారులతో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యర్థాలను, తవ్విన మట్టిని ఎక్కడబడితే అక్కడ డంపింగ్‌ చేయడం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందనేది ఎన్‌జీటీకి వెళ్లిన ఫిర్యాదు సారాంశం.  మే 10వ తేదీన ఈ అంశంపై సుప్రీం కోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో ఎన్‌జీటీ కమిటీ ఈ పర్యటన చేపట్టారు. ఇప్పుడు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఈ ప్రాజెక్టు భవితపై ఆందోళన వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

సీఎస్ వర్సెస్ సీఎం గొడవేంటో అర్ధం కావడం లేదు…

ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేసేందుకు ప్రయత్నం…

రాష్ట్రంలో ముఖ్యమంత్రికి, సీఎస్ కు మధ్య గొడవ ఏంటో నాకు అర్థం కావడం లేదు. వైఎస్సార్‌ ఉన్న సమయంలో కూడా ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్ నేతలను చాలా ఇబ్బంది పెట్టింది. ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పడుతూ కోర్డుకు వెళ్లారు‌. కోర్టు మొట్డికాయలు వేస్తే ఎల్వీకి బాధ్యతలు ఇచ్చారు. అసలు చంద్రబాబుకు సుబ్రమణ్యంతో గొడవ ఏంటో అర్ధం కావడం లేదు. చంద్రబాబు మీరు మోడీని విమర్శించండి, లెదా జగన్ ని ఇతర నేతలను విమర్శించండి. సిఎస్ ను ఎందుకు విమర్శిస్తున్నారు. చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న వారికి బిల్లులు మంజూరు చేయలని తపన పడ్డారు. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఎల్వీపై ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు ఉండవల్లి అరుణ్ కుమార్. ఇది చాలదన్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వీఎంలపై విమర్శలకు దిగుతున్నారని ఉండవల్లి ఎద్దేవా చేశారు. 50 శాతం వీవీ ప్యాడ్ల స్లిప్పులు లెక్కించాలని కోరుతున్నారన్నారు.  అసలు ఓటేసిన తర్వాత మీడియా ముందుకొచ్చి.. ఏ ముఖ్యమంత్రి అయినా నా ఓటు నాకే పడిందో లేదో తెలియ తెలియదు అంటారా అని ప్రశ్నించారు ఉండవల్లి. ఈ వ్యవహారమంతటికీ కారణం చంద్రబాబు ఈ మధ్య కాలంలో ఫ్రస్టేషన్ కు గురి కావడమేనని ఉండవల్లి చెప్పారు.  కొంచెం ఇరిటేసన్ను తగ్గించుకోండంటూ చంద్రబాబుకు సూచించారు. మీరు ఓడిపోయినా..మీ పార్టీ జనంలో ఉంటుంది. ఈసారి కాకపోతే వచ్చే సారి అధికారంలోకి వస్తుంది. ఎందుకు రిజల్ట్ రాకుండానే ఆవేశపడుతున్నారో అర్థం కావలేదు. యూపిఏ హయాంలోనే ఈవీఎంల వాడకం ప్రారంభమైంది. ఓసారి ఓడిపోయారు.., గత ఎన్నికల్లో ఇవే ఈవీఎంలతో గెలిచారు కదా..మరి ఇప్పుడు వాటితోనే ఎన్నికలకు వెళ్తే ఎందుకు అంత ఇదవుతున్నారు? ప్రతి నియోజకవర్గంలో ఐదు స్లిప్పులు లెక్కిస్తారు. అందులో తేడా వస్తే అప్పుడు తప్పుపట్టాలి గానీ… ఏమీ లేకుండా వివాదం క్రియేట్ చేయడం వల్ల ప్రయోజనం ఉండదంటూ ఉండవల్లి  హితవు పలికారు.

ప్రధాని నోరు జారుతున్నారు…

ఇటు ప్రధాని నరేంద్రమోదీపై కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శలు సంధించారు. ప్రధాని నరేంద్ర మోదీ బిహార్ ఎన్నికల ప్రచారంలో చాలా దారుణంగా మాట్లాడారని ఉండవల్లి మండిపడ్డారు. ఆంధ్రా, తెలంగాణ ప్రజలు…ఇండియా, పాకిస్తాన్ లా ఒకరి మొఖం ఒకరు చూసుకోవడం లేదంటూ మోదీ వ్యాఖ్యానించడం దారుణమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ అన్నారు. ఒక దేశ ప్రధాని ఆ దేశంలోని రాష్ట్రాలను అలా విమర్శించడం సరి కాదన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రజల మధ్య ఎటువంటి విబేధాలు గానీి, వివాదాలు గానీ లేవని, ఐదేళ్ల తర్వాత రాజకీయ ప్రయోజనాల కోసమే మోదీ ఈ తరహా  వ్యాఖ్యలు చేశారని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన మీద చర్చ పెట్టమంటూ ముందు నుంచీ తాను చెబుతున్నా సరే పట్టించుకోకుండా…ఈ తరహా వ్యాఖ్యలు చేయడమేంటని ప్రశ్నించారు ఉండవల్లి.  ఆఖరికి ఇండియా – పాకిస్తాన్ లాగా ఆంధ్రా – తెలంగాణాని మార్చారంటూ వ్యాఖ్యలు చేసేస్థాయికి మోదీ దిగజారారన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇక్కడ స్నేహంగానే ఉన్నారని… ఒక దేశ ప్రధాని దేశంలోని రాష్ట్రాలను ఆదు కోవల్సింది పోయి ఇలా విమర్శించడం సరైంది కాదన్నారు. ఇకనైనా..కొత్తగా ఎన్నికయ్యే అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్థులు విభజన జరిగిన తీరు మీద మరోసారి చర్చ జరిగేలా చూడాలని అరుణ్ కుమార్ కోరారు. ప్రధాని మోదీ దేశానికి ప్రాతినిధ్యం వహించేలా మాటలు మాట్లాడాలని..ఎన్నికల్లో లబ్ది కోసం ప్రజల మధ్య మనస్ఫర్ధలు వచ్చే వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు.

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.