ఉండవల్లికి మంత్రి పదవి..నిజమా కాదా…

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తలో నిజమెంత…

జగన్ కు ఆ ఆలోచన ఉందా..లేదా..

ఇది నిజమో కాదో తెలుసుకునే ముందు అసలేం జరిగిందో తెలుసుకోవాలి.  మాజీ ఎంపీ , వైఎస్ కు అత్యంత సన్నిహితుడైన ఉండవల్లి అరుణ్ కుమార్. పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. మాటల్తోనే కాదు..సబ్జెక్ట్ పరంగా కూడా తిమ్మిని బమ్మి చేస్తూ ప్రత్యర్ధుల నోళ్లు మూయించగల సమర్ధుడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందనే అంచనాల నేపధ్యంలో ఉండవల్లికి మంత్రి పదవి ఇస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్త షికారు చేస్తోంది గత నాలుగురోజులుగా.

అంతేకాదు దీనికి కారణాల్ని కూడా అదే సోషల్ మీడియా వండివార్చేసింది. ఇప్పుడు జగన్ తో ఉన్న బొత్స సత్యనారాయణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, విశ్వరూప్, ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రరావులు గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవమున్న వారే అయినా…కీలకంగా భావించే అసెంబ్లీ వ్యవహారాల శాఖకు న్యాయం చేయలేరని జగన్ భావిస్తున్నట్టుగా ఈ వార్త తిరుగుతోంది. అసెంబ్లీలో చంద్రబాబును ఏకిపారేయడానికైనా…టీడీపీ నేతల నోళ్లు ముూయించాలన్నా ఉండవల్లి మాత్రమే సమర్ధు డనేది జగన్ ఆలోచనగా ఈ వార్త షికారు చేస్తోంది. ఈ వార్తని ఆధారం చేసుకుని ఎల్లో మీడియా ప్రచారం మొదలెట్టేసింది. జగన్ కు, ఉండవల్లికు లింకు పెట్టేసింది. జగన్ అధికారంలో వచ్చిన వెంటనే ముందు జరిగేది ఇదేనంటూ ప్రచారం జరుగుతోంది.

అసలీ వార్తలో కాసింతైనా నిజముంటే..వైసీపీ అనుబంధిత సోషల్ మీడియాలో వచ్చుండేది. అలా జరగలేదు. కనీసం జగన్ గానీ, వైసీపీ నేతలు గానీ ఎక్కడా ఎప్పుడూ చెప్పలేదు. అటు ఉండవల్లి అయితే తాను రాజకీయాల్లోకే రానంటూ చాలాసార్లు స్పష్టంగా చెప్పేశారు. ఇటు జగన్ ఈ  విషయమై కనీసం ఆలోచించారో లేదో తెలియదు గానీ…ఇంకేముందు ఉండవల్లి మంత్రి అయిపోయారంటూ ఎల్లోమీడియా సోషల్ మీడియా వేదికగా ఈ ప్రచారాన్ని ప్రారంభించింది. టీడీపీకు లేని ఆలోచనలు..వైసీపీకు రాని ఆలోచనలు ఈ ఎల్లో మీడియాకే ఎందుకొస్తున్నాయో అర్ధం కాని ప్రశ్న. ఎన్నికలు ముగిసినప్పటి నుంచీ అదే తంతు ఎల్లోమీడియాకు. ముఖ్యమంత్రి పేరుతో నేమ్ ప్లేట్ తయారు చేసుకున్నారంటో ఓ విష ప్రచారాన్ని చేసింది ముందు. అనంతరం ప్రమాణస్వీకార తేదీ, ముహూర్తం, స్థలం నిర్ధారణ అయిపోయిందంటూ మరో ప్రచారాన్ని అందుకుంది. ఇప్పుడు తాజాగా ఉండవల్లికి మంత్రి పదవి ప్రచారంతో ఏదో దురుద్దేశాన్ని ప్రాచుర్యంలోకి తెస్తోంది.

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.