డెలాయిట్ పై ఐదేళ్ల నిషేధం…?

ఆడిటింగ్ లోపాలపై విస్పష్ట ఆధారాలు..

ఐఎల్ అండ్ ఎఫ్ ఎస్ కేస్ లో అవకతవకలు…

ప్రపంచంలోని దిగ్గజమైన ఆడిటింగ్ సంస్థల్లో బిగ్ 4గా పిల్చుకునే నాలుగు ప్రముఖ కంపెనీల్లో ముందు వరుసలో ఉండేది డెలాయిట్ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా ప్రతిదేశంలోనూ..స్థానిక భాగస్వాములతో కలిసి బడా కంపెనీలకు ఆడిటింగ్ సేవలందిస్తోంది. దేశంలోని అన్ని ప్రముఖ నగరాల్లో శాఖల్ని కలిగిన ఈ సంస్థ ఇప్పుడు చిక్కుల్లో పడనుంది. ఐఎల్ అండ్ ఎఫ్ ఎస్ లో చోటుచేసుకున్న భారీ రుణ కుంభకోణానికి సంబంధించిన దర్యాప్తులో డెలాయిట్ పాత్రపై ఆధారాలు లభ్యం కావడమే దీనికి కారణం…

ప్రభుత్వ రంగ ఆర్థిక సేవల సంస్థ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌లో చోటుచేసుకున్న భారీ రుణ కుంభకోణానికి సంబంధించి దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో అంతర్జాతీయ ఆడిటింగ్‌ దిగ్గజం డెలాయిట్‌ అవకతవకలకు పాల్పడిందన్న ఆరోపణలపై స్పష్టమైన ఆధారాలున్నాయని తెలుస్తోంది. దాంతో ఇండియాలో ఆ సంస్థపై నిషేధం విధించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఖాతాల ఆడిటింగ్‌ ప్రక్రియ విషయంలో డెలాయిట్‌ అక్రమాలకు పాల్పడిందని కేసును దర్యాప్తు చేస్తున్న తీవ్ర ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ(ఎస్‌ఎఫ్‌ఐఓ) నిగ్గు తేల్చినట్లు సమాచారం. కంపెనీల చట్టంలోని 140(5) సెక్షన్‌ ప్రకారం డెలాయిట్‌పై నిషేధం విధించేందుకు కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాయత్తం అవుతోందని తెలుస్తోంది. దాదాపు 91 వేల కోట్ల రుణాల ఊబిలో కూరుకుపోయిన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ కంపెనీలు.. బకాయిలు తీర్చలేక చేతులెత్తేసిన(డిఫాల్ట్‌) సంగతి తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం కంపెనీని తన అధీనంలోకి తీసుకోవడంతోపాటు చోటుచేసుకున్న అక్రమాలపై దర్యాప్తు ఏజెన్సీలతో విచారణను వేగవంతం చేసింది.

డెలాయిట్ ఏమంటోంది…

అయితే ఈ ఉదంతంపై డెలాయిట్ స్పందించింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఫైనాన్షియల్‌ సర్వీస్‌(ఐఎఫ్‌ఐఎన్‌)పై దర్యాప్తుకు తాము పూర్తిగా సహకరిస్తున్నామని.. ఆడిటింగ్‌ ప్రమాణాలు, ఇతరత్రా చట్టాలు, నిబంధనలకు లోబడే తాము ఆడిట్‌ను నిర్వహించామని ఆ కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు మొత్తం 347 అనుబంధ సంస్థలు ఉండగా.. ఇందులో మెజారిటీ కంపెనీలకు చిన్నాచితకా ఆడిట్‌ సంస్థలే ఆడిటింగ్‌ను నిర్వహించాయని కూడా డెలాయిట్‌ స్పష్టం చేసింది. అంతేకాకుండా గ్రూప్‌లో రెండు ప్రధాన కంపెనీలైన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ నెట్‌వర్క్స్‌కు ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ ( ఈవై)  భాగస్వామైన ఎస్‌ఆర్‌బీసీ అండ్‌కో 2017–18, 2018–19లో ఆడిట్‌ నిర్వహించిందనని డెలాయిట్ తెలిపింది. అదేవిధంగా ఐఎఫ్‌ఐఎన్‌కు 2018–19లో కేపీఎంజీ పార్ట్‌నర్‌ అయిన బీఎస్‌ఆర్‌ ఆడిట్‌ చేపట్టిందని వెల్లడించింది. చాలా ఏళ్లుగా తాము ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ ఆడిటింగ్‌ చేస్తున్నామని.. చాలా వరకూ రుణాలకు తగినంత తనఖాలు ఉన్నాయనేది డెలాయిట్‌ వాదన. నైట్‌ఫ్రాంక్‌ వంటి సంస్థలతో దీనిపై స్వతంత్ర వేల్యుయేషన్‌ కూడా జరిగిందని అంటోంది.

నిషేధం ఎప్పటివరకూ..

సత్యం స్కామ్‌లో ఇప్పటికే ఒక అంతర్జాతీయ ఆడిట్‌ అగ్రగామి ప్రైస్‌ వాటర్‌హౌస్‌(పీడబ్ల్యూసీ)పై 2018లో సెబీ రెండేళ్ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా పీడబ్ల్యూకు చెందిన రెండు పార్ట్‌నర్‌ సంస్థలపై మూడేళ్లు నిషేధం విదించారు.. ఇప్పుడు డెలాయిట్‌పైనా ఇవే చర్యలు తీసుకుంటే… నిషేధాన్ని ఎదుర్కోనున్న రెండో అంతర్జాతీయ ఆడిట్‌ సంస్థగా నిలవనుంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఖాతాల్లో చోటుచేసుకున్న తీవ్రమైన ఆర్థిక అవకతవకలను కావాలనే చూసీచూడనట్లు వదిలేసినట్లు డెలాయిట్‌పై విజిల్‌బ్లోయర్‌.. ఎస్‌ఎఫ్‌ఐఓకు రాసిన లేఖ ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌లో సంక్లిష్టతను ఆసరాగా చేసుకుని ఎగ్జిక్యూటివ్‌లతో డెలాయిట్‌ కుమ్మక్కయిందని.. ఇందుకుగాను భారీగా ఫీజులు, కాంట్రాక్టులను దక్కించుకుందనేది విజిల్‌బ్లోయర్‌ ఆరోపణ. డెలాయిట్ పై ఉన్న ఈ ఆరోపణలన్నీ రుజువైతే గరిష్టంగా ఐదేళ్ల వరకూ ఆ కంపెనీపై నిషేధం విధించవచ్చని వాణిజ్యవర్గాలు చెబుతున్నాయి.

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.