మే 23న ఫలితాల వెల్లడిలో ఆలస్యం…

సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడిలో జాప్యం…

మే 23 సాయంత్రానికి గానీ స్పష్టత రాని పరిస్థితి..

వీవీప్యాట్ల లెక్కింపే కారణం…

ఈసారి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరింత ఆలస్యం కానున్నాయి. దాదాపు ఐదారుగంటల జాప్యం జరగనుంది. దేశ వ్యాప్తంగా వీవీప్యాట్ల లెక్కింపు జరగాల్సిన నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల వెల్లడిలో ఆలస్యమయ్యే అవకాశముందని సాక్షాత్తూ ప్రధాన ఎన్నికల కమీషనర్ గోపాలకృష్ణ ద్వివేదీ తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన పలు అంశాలపై స్ఫష్టత ఇచ్చారు.

వీవీప్యాట్ల లెక్కింపు కారణంగా ఎన్నికల ఫలితాలు ఆలస్యం కానున్నాయని ద్వివేదీ చెప్పారు. ఈవీఎంల లెక్కింపు పూర్తయ్యాక వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు జరుగుతుంది. అభ్యర్థుల, ఏజెంట్ల సమక్షంలో అధికారులు వీవీప్యాట్‌ల ర్యాండమైజేషన్‌ చేస్తారు. ఒక్కో శాసనసభ నియోజవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ, ఐదు లోక్‌సభ వీవీప్యాట్‌లలోని స్లిప్పులను లెక్కించాల్సి ఉంటుంది. ఈ పద్దతిన రాష్ట్రవ్యాప్తంగా 1750 వీవీప్యాట్‌లలో పోలైన స్లిపుల్ని లెక్కించాలి. ఒక్కో వీవీప్యాట్‌లో వెయ్యి ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది. ఒక వీవీప్యాట్‌లోని స్లిప్పుల లెక్కింపునకు సగటున గంట, గంటన్నర సమయం పడుతుంది. ఈ స్లిప్పులు లెక్కించే అధికారం ఆర్వో, అబ్జర్వర్‌లకు మాత్రమే ఉంది. దీంతో ఒక్కో అసెంబ్లీ పరిధిలో ఫలితాల వెల్లడికి సగటున ఐదారు గంటలకు పైగా సమయం పడుతుంది. ఈవీఎంలలో పోలైన ఓట్లతో వీవీప్యాట్‌ స్లిప్పులు సరిపోయిన తరువాతే ఫలితాలు వెల్లడిస్తాం. మొదట అసెంబ్లీ, తర్వాత లోక్‌సభ ఫలితాలు వెలువడుతాయని ద్వివేదీ వివరించారు.

సాధారణంగా అయితే కౌంటింగ్ రోజు మధ్యాహ్నం 12 గంటలకల్లా ఫలితాలు దాదాపు వెల్లడయిపోతుంటాయి. అలా కాకపోయినా ఎవరిది అధికారమనే విషయంపై స్పష్టత వచ్చేస్తోంది. ఇప్పుడు వీవీప్యాట్ల లెక్కింపు ఉండటం, ఇది పూర్తయిన తరువాతే ఫలితాలు వెల్లడి చేయనుండటంతో సాయంత్రానికి గానీ పూర్తి పలితాలు రాలేవని తెలుస్తోంది.

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.