ఫొని ప్రభావం ఏపీకే…

ఉత్తర కోస్తావైపు దూసుకొస్తోన్న ఫొని…

మే 1వ తేదీకు అతి తీవ్రతుపానుగా…

బంగాళాఖాతంలో ఏర్పడిన ఫొని తుపాను అంతకంతకూ తీవ్రతను పెంచుకుంటోంది. ముందుగా ఊహించినట్టే హుద్ హుద్  స్థాయిలో విరుచుకపడనుందని తెలుస్తోంది. గంటకు 195 కిలోమీటర్లపై వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరిస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘ఫొని’ తుపాన్‌ దిశపై స్పష్టత వస్తోంది. ఇది ఇప్పుడు ఉత్తర కోస్తా వైపు దూసుకోస్తోంది.. మే 2 నుంచి ఫొని ఉత్తరాంధ్రపై ప్రభావం చూపనుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 840 కి.మీ దూరంలో, మచిలీపట్నానికి 990 కి.మీ దూరంలో తుపాన్‌ కేంద్రీకృతమై ఉంది. ఫొని మంగళవారం లేదా బుధవారం అతి తీవ్ర తుపాన్‌గా మారనుంది. తుపాన్‌ ప్రభావంతో దక్షిణ కోస్తాలో మంగళవారం నుంచి తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. మే 3వ తేదీ నుంచి ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. దీంతో అధికారులు అన్ని ప్రధాన పోర్టులో రెండో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీచేశారు.

ఫొని తుపాను తీవ్రత రోజురోజుకు ఉధృతమవుతోంది. ఊహించిన విధంగానే సూపర్‌ సైక్లోన్‌గా మారనుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుపాను వాయవ్య దిశగా గంటకు 21 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఆదివారం అర్ధరాత్రికి తీవ్ర తుపానుగాను, అనంతరం 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగాను మారనుంది. ఇలా మే ఒకటో తేదీ సాయంత్రం వరకు క్రమంగా వాయవ్య దిశగా పయనించనుంది. ఆ తర్వాత మలుపు (రీకర్వ్‌) తీసుకుని ఉత్తర ఈశాన్య దిశలో కదులుతుంది.

ఈ నేపధ్యంలో మే 1 నుంచి కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది. తీరం ఎక్కడ దాటే విషయంపై ఇంకా స్పష్టత లేకపోయినా…అతి తీవ్ర తుపానుగా మారనుండటంతో హుద్ హుద్ స్థాయిలో పెనుగాలులు మాత్రం వీస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది.

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.