అతి తీవ్రతుపానుగా మారనున్న ఫొణి తుపాను..

మరో 24 గంటల్లో అతి తీవ్రంగా మారనున్న ఫొణి…

తీవ్ర పరిణామాలుంటాయన్న ఐఎండీ హెచ్చరికలు..

హుద్ హుద్ తరువాత  అంతటి తీవ్రత ఉన్న తుపానుగా ఫొణి ని లెక్కేస్తున్నారు వాతావరణ శాస్త్రజ్ఞులు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫొణి తుపాను అంచనాలకు  అందడం లేదు. కచ్చితంగా ఎక్కడ తీరం దాటుతుందో తెలియడం లేదు. తీరాన్ని..అధికారుల్ని తీవ్రంగానే వణికిస్తోంది. ఇప్పటికే తుపానుగా మారిన ఫొణి…మరి కొన్ని గంటల్లో తీవ్ర తుపానుగా మారనుంది. రానున్న 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనుందని ఐఎండీ  వెల్లడించింది.

ప్రస్తుతం మచిలిపట్నం, చెన్నై మధ్య కేంద్రీకృతమై ఉన్నఫొణి రానున్న 24 గంటల్లో  అతి తీవ్ర తుపానుగా మారి విధ్వంసం సృష్టించే అవకాశాలున్నాయని వాతావరణ విభాగం ఇప్పటికే వెల్లడించింది. అతి తీవ్ర తుపానుగా మారిన తరువాత ఫొణి..ఈ నెల 30 వరకు వాయువ్య దిశగా ప్రయాణిస్తుందని, అనంతరం రీకర్వ్ తీసుకొని ఈశాన్యం దిశగా వెళుతుందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఫొని తుపాను ప్రభావంతో తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశముంది. తుపాను తీరానికి దగ్గరయ్యే కొద్దీ కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడొచ్చునని వాతావరణ శాఖ తెలిపింది. ఫొని తుపాను నేపథ్యంలో విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో రెండు నంబరు ప్రమాద హెచ్చరికను జారీచేశారు.

ఫొని తుపాను ముంచుకొస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ అధికారులను అప్రమత్తం చేశారు. కలెక్టరేట్‌లలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. బంగాళాఖాతంలో ఫొని తుపాను ప్రభావం వల్ల నెల్లూరు తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. తూపిలిపాలెం, కొత్త కోడూరు, మైపాడు, రామతీర్థం, తుమ్మలపెంట తదితర తీర ప్రాంతాల్లో సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. ఫొని తుపాను నేపథ్యంలో మత్స్యకారులు, పర్యాటకులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారుల హెచ్చరించారు.

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.