మహానటి వల్లనే కష్టమైపోతుంది…కీర్తి సురేశ్

ప్రేక్షకుల అంచనాలు పెరిగిపోతున్నాయి..

మంచి కధ ఎంచుకోవడంలో ఇబ్బందులు వస్తున్నాయి…

సినిమాలు చేయడం వేరు…మైలురాయిగా నిలిచే సినిమాలు చేయడం వేరు. ఎవరికైనా సరే కెరీర్ లో కొన్ని చిత్రాలు మాత్రం మైలురాయిగా నిలిచిపోతాయి. ఆ చిత్రాలే పేరు తీసుకొస్తాయి కెరీర్ లో. ఎన్ని వాణిజ్యపరమైన సినిమాలు చేసినా సరే..కీర్తి సురేశ్ కు మాత్రం మహానటి మరపురాని మహా ఘట్టమే అవుతుంది. అయితే అదే కొన్నిసార్లు ఇబ్బందులు కూడా తెచ్చిపెడుతోంది.

మహానటి (నడిగైయార్‌-తమిళ చిత్రం) తరువాత తనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటోంది మన మహానటి కీర్తి సురేశ్. ఇప్పుడు తాను ఏ చిత్రంలో నటించినా వాటిపై ప్రేక్షకుల మధ్య అంచనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని…దాంతో మంచి కధ ఉన్న సినిమాలు ఎంచుకోవడం కష్టమైపోతోందని తెలిపింది కీర్తి.  అయితే మంచి నిర్ణయాలు తీసుకోవడం అన్నది తనకు చిన్నతనం నుంచే ఉందని అంది. అందుకే కథల ఎంపికలో చాలా తెలివిగా ఉన్నానని చెప్పింది. కథలో ఎంపికలో తొందర పడదలుచుకోలేదని తెలిపింది. తన విజయ రహస్యం కూడా ఇదేనని కీర్తీసురేశ్‌ చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికి మలయాళం, తెలుగు భాషల్లో ఒక్కో చిత్రం మాత్రమే చేస్తున్న కీర్తికు…తమిళంలో సర్కార్‌  తరువాత మరో చిత్రం లేదు. అయితే కీర్తి సురేశ్ మాత్రం.. దక్షిణాదిలో తనకు చాలా అవకాశాలు వస్తున్నాయని అంటోంది.

షూటింగ్‌ సెట్‌లో దాదాపు 100 మందిని గురువులుగా చూడవచ్చని అంటోంది కీర్తి.  వారు చేసే పనిలో నైపుణ్యం, లైట్‌మెన్‌ నుంచి దర్శకుడి వరకూ వృత్తిపై చూపే శ్రద్ధ, అంకితభావం తనను చాలా ఆకట్టుకుంటాయని అంటోంది. నటీనటులు వారు ఎంచుకునే కథలపైనే వారి మనుగడ ఆధారపడి ఉంటుందని చెబుతున్న కీర్తి…రానున్న కాలంలో ఇంకెన్ని మహా ఘట్టాల్ని ఆవిష్కరిస్తుందో చూడాలి మరి.

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.