అతను చనిపోయాడు…వందల కోట్లు వదులుకోవల్సిందేనా…

క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టర్ల ఆందోళన…

ఫౌండర్ గెరాల్డ్ కాటన్ ఆకస్మిక మరణంతో తలెత్తిన ఇబ్బందులు..

982 కోట్ల కరెన్సీ ఫ్రీజ్…పాస్ వర్డ్, రికవరీ తెలియక అయోమయంలో నిపుణులు…

బిట్ కాయిన్, లైట్ కాయిన్,ఎధిరియం లాంటి డిజిటల్ కరెన్సీ ట్రేడింగ్ వేదిక క్వాడ్రిగా సీఎక్స్ ఎక్స్చేంజ్. దీని ఫౌండర్ కెనడాకు చెందిన క్రిప్టో కరెన్సీ ఫౌండర్ అయిన గెరాల్డ్ కాటన్ ఇండియాలో ఆకస్మికంగా మరణించారు. ఓ అనాధాశ్రమానికి సేవలందిస్తున్న తరుణంలో ఆయన గత ఏడాది డిసెంబర్ 9న మరణించారని…సోషల్ మీడియా వేదికగా ఆ కంపెనీ జనవరి 14న ప్రకటించింది. అంతే అక్కడ్నించి ప్రారంభమైంది అందరిలో టెన్షన్. అతను చనిపోతే టెన్షన్ ఎందుకంటారా….ఈ ఎక్స్టేంజ్ వేదికపై ఏకంగా 982 కోట్ల కరెన్సీ ముడిపడి ఉంది మరి. ఇతని మరణం లక్షలాది ఇన్వెస్టర్లను ఆందోళనలో నెట్టింది.

ఎందుకంటే…ట్రేడింగ్ ప్లాట్ ఫాం కు సంబంధించిన పాస్‌వర్డ్‌లు, రికవరీ కీ తదితర ముఖ్యమైన సమాచారం కేవలం చనిపోయిన గెరాల్డ్‌కు మాత్రమే తెలుసు. పాస్‌వర్డ్‌, రికవరీ కీ మరెవ్వరికీ తెలియకపోవడంతో, దాదాపు 187 మిలియన్ల కెనడా డాలర్లు( రూ.982 కోట్లు) ఫ్రీజ్‌ అయిపోయాయి. దాంతో  ఈ గండంనుంచి గట్టెక్కేందుకు టెక్‌ నిపుణులు అష్టకష్టాలు పడుతున్నారు.  అయినా ఎలాంటి ఫలితం కనిపించకపోవడంతో సంస్థలో ఇతర అధికారులు తలలు పట్టుకున్నారు. మరోవైపు గెరాల్డ్‌ ఎలా చనిపోయాడు? నిజంగా చనిపోయాడా లేదా  కంపెనీ మోసం  చేస్తోందా లాంటి పలు అనుమానాలు, ప్రశ్నలతో  ఆన్‌లైన్‌ దుమారం కూడా రేగింది. అంతేకాదు గెరాల్డ్‌ భార్య జెన్నిఫర్‌  రాబర్ట్‌సన్‌కు వేధింపులు,  బెదిరింపులు తీవ్ర మయ్యాయి. దాంతో తనకూ, కంపెనీకి రక్షణ కల్పించాల్సిందిగా కోర్టును ఆశ్రయించారామె. ఆమె అభ్యర్ధన మేరకు క్వాడ్రిగా సీఎక్స్‌ ఎ‍క్స్చేంజ్‌కు నోవా స్కోటియా ఉన్నత న్యాయస్థానం దివాలా రక్షణను మంజూరు చేసింది. అంతేకాకుండా ఈ వేదికపై కరెన్సీ ట్రేడింగ్ ను  నిలిపివేసింది. కేవలం  మరణించిన గెరాల్డ్ కాటన్ కు మాత్రమే తెలిసిన పాస్‌వర్డ్‌లను ఎక్కడా రాసిపెట్టకపోవడంతో వాటిని కనుక్కోవడం చాలా కష్టంగా మారిందంటూ కంపెనీ తరపున జెన్నిఫర్‌ రాబర్ట్‌సన్‌  అఫిటవిట్‌ దాఖలు చేశారు. అలాగే  గెరాల్డ్‌  సెల్ ఫోన్లు, ఇతర కంప్యూటర్లలోని సమాచారం కోసం  సంబంధిత ఎన్క్రిప్షన్లను ఛేదించడానికి నిపుణులతో ప్రయత్నిస్తున్నా ఫలితం లభించలేదన్నారు.

ఇకపోతే క్వాడ్రిగాలో 3 లక్షల 63 వేలమంది యూజర్లు నమోదుగాకా, దాదాపు  లక్షా పదిహేను వేలమందికి 250 మిలియన్ల కెనడా డాలర్లు రుణపడి ఉన్నామని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో రాబర్ట్‌సన్‌ పేర్కొన్నారు. ఇప్పుడీ పాస్ వర్డ్  ఛేదించలేకపోతే ఆ 982 కోట్ల పరిస్థితి ఏంటి…చనిపోయిన గెరాల్డ్ ఆత్మ వచ్చి ఓపెన్ చేస్తే గానీ మదుపరులకు డబ్బు దక్కదా…పరిస్థితి అలాగే కన్పిస్తోంది మరి.

Spread the love
 • 8
 •  
 •  
 •  
 •  
 •  
  8
  Shares
 •  
  8
  Shares
 • 8
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.