చరిత్ర సృష్టించిన మేరీకోమ్…

చరిత్ర సృష్టించిన మేరీకోమ్…

ఆరు బంగారు పతకాలతో రికార్డు…

2020 టోక్యో స్వర్ణంపైనే తదుపరి గురి…

ఆమె పంచ్ కు తిరుగులేదని మరోసారి నిరూపితమైంది. బరిలో దిగితే ప్రత్యర్ధులు హడలెత్తాల్సిందేనని చాటి చెప్పింది. మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో తనకు తిరుగెవరూలేరని పంచ్ విసిరింది. భారత బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ ఆరోసారి బంగారు పతకాన్ని సాధించింది. శనివారం జరిగిన 48 కేజీల విభాగం ఫైనల్ పోటీలో ఉక్రెయిన్‌కు చెందిన హనా ఒఖోటాను 5-0తో మట్టి కరిపించింది. మేరీ విసిరిన పంచ్‌ల ముందు హనా ఒఖోటా నిలవలేకపోవడంతో… ఫలితం ఏకపక్షమైంది. తాజా విజయంతో ఆరు బంగారు పతకాలు నెగ్గిన తొలి మహిళా బాక్సర్‌గా ఈ మణిపూరి మహిళ చరిత్ర కెక్కింది. ఇప్పటి వరకు ఐర్లాండ్‌కు చెందిన కేటీ టేలర్‌ (5 స్వర్ణాలు, 1 కాంస్యం)తో సమంగా ఉన్న మేరీకోమ్‌…ఆరో పతకం కైవసం చేసుకుని ఆ రికార్డును అధిగమించింది. అంతేకాకుండా పురుషుల విభాగపు రికార్డులో సమంగా నిల్చింది. ఈ విభాగంలో క్యూబాకు చెందిన బాక్సర్ ఫెలిక్స్ సవాన్  సరసన స్థానం సాధించింది. 2002, 2005, 2006, 2008, 2010 ఛాంపియన్ షిప్ లలోనూ…ఇప్పుడు స్వర్ణ పతకాల్ని సంపాదించింది. అంతకుముందు ఆరంగ్రేటంలో 2001లో రజతం సాధించింది.

 

విజయం అనంతరం భావోద్వేగానికి లోనైన మేరీకోమ్…కన్నీటి పర్యంతమైంది. ఇన్నాళ్లూ తనకు మద్దతుగా నిల్చిన అభిమానులకు ధన్యావాదాలు తెలిపింది. 2020 టోక్యోలో స్వర్ణమే తన లక్ష్యమంది. ముగ్గురు పిల్లల తల్లి అయిన ఈ ఛాంపియన్ జీవితం ఆధారంగా ఇప్పటికే బాలీవుడ్ లో సినిమాలు తీశారు. ఆమె జీవితం ఎందరో క్రీడాకారులకు…ముఖ్యంగా మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది.

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.